Revanth Reddy | హైదరాబాద్, అక్టోబర్3 (నమస్తే తెలంగాణ): కొందరు పేదలను, కిరాయి మనుషులను ఎగదోసి మూసీ, హైడ్రా కూల్చివేతలపై రాజకీయం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మూసీ కూల్చివేతలపై ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతపై తీవ్రస్వరంతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలే చెరువులను ఆక్రమించి ప్లాట్లుగా పేదలకు అమ్మారని, ఇప్పుడు ఆ ఆక్రమణలు ఎక్కడ బయటపడుతాయోనని పేదలను, కిరాయి మనుషులను ఎగదోసి ఆగమాగం చేస్తున్నారని ఆరోపించారు. ‘డ్రైనేజీ నీళ్లు హైదరాబాద్ నగరం తాగాలా? ముసుగు తొడుక్కునేందుకు మూసీ కావాల్సి వచ్చిందా? మూసీని అడ్డం పెట్టుకుని ఎంతకాలం బతుకుతారు. నెల రోజులులైనా మిమ్మల్ని వదల.. మీ భరతం పడతా.. ఒక్కొక్కరిని చింతపండు చేస్తా’ అంటూ సీఎం ఆగ్రహంతో ఊగిపోయారు. సికింద్రాబాద్ సిక్ విలేజీలోని హాకీ గ్రౌండ్స్‌లో గురువారం జరిగిన కుటుంబ గుర్తింపు, కుటుంబ డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. 119 నియోజకవర్గాల్లో పైలెట్ ప్రాజెక్ట్‌గా దీనిని చేపట్టామని, ఒక్క క్లిక్‌తో 30 శాఖల సమాచారం ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ‘వన్ స్టేట్ వన్ కార్డు’ విధానంతో సంక్షేమ పథకాలతోపాటు హెల్త్ ప్రొఫైల్‌ను పొందుపరుస్తామని తెలిపారు. పేదలకు ఇండ్లు కట్టించేందుకు, నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, ప్రతిపక్షాలు కలిసిరావాలని చెప్పారు. నగరానికి మంచి భవిష్యత్తును అందించేందుకు చెరువులు, నాళాలు, మూసీ ఆక్రమణలు తొలగించాల్సిందేనని ఉద్ఘాటించారు.
హైదరాబాద్ నగరాన్ని కాపాడాలనే ఉద్దేశంతో హైడ్రా, మూసీ ప్రాజెక్టులను తీసుకొచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మూసీ ప్రాంత పేదలకు ప్రత్యామ్నాయం ఏం చేయాలో చెప్పాలని, వినడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ప్రతిపక్ష పార్టీల నేతలను కోరారు. అక్రమంగా నిర్మించుకున్న ఫాంహౌస్‌లను ఎక్కడ కూల్చివేస్తరోనని కేటీఆర్, హరీశ్‌రావు, సబితమ్మ పేద ఏడ్పులు ఏడుస్తున్నారని, కేవీపీ అక్రమంగా నిర్మించిన ఫామ్‌హౌస్‌ను కూ ల్చాలా వద్దా? అంటూ ప్రశ్నించారు.
మూసీ పరిధిలోని పేదలకు న్యాయం చేసేందుకు ఇద్దరం కలిసి మోదీ వద్దకు వెళ్దాం.. పాతిక వేల కోట్లు తీసుకొద్దాంరా.. అంటూ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. మూసీ కూల్చివేతలపై ఈటల అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
సీఎం రేవంత్‌రెడ్డి.. చట్టం, సిస్టం లేని ఓ అరాచక శక్తి అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌పై ఆయన ఘాటుగా స్పందించారు. ‘నీకు దమ్ముంటే ఇద్దరం వితౌట్ సెక్యూరిటీతో మూసీ పరీవాహక ప్రాంతంలో కూలగొట్టబోతున్న ఇండ్ల వద్దకు వెళ్దాం. ‘శభాష్ రేవంత్‌రెడ్డి’ అని ఒక్కరు అన్నా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. లేదంటే బహిరంగంగా క్షమాపణ చెప్పి ముకు నేలకు రాస్తావా’ అంటూ ప్రతిసవాల్ విసిరారు.
‘ఏది పడితే అది వాగుడు.. అడ్డగోలుగా తప్పులు.. విపరీతంగా అప్పులు.. దాంతో రాష్ట్రం నిండా మునిగింది. ఇవాళ మేం సరిదిద్దుతామని చేస్తుంటే అడ్డం పడుతున్నరు’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ నగరాన్ని కాపాడాలని తాము ముందుకు పోతుంటే దాని మీద కూడా బురద జల్లుకుంటూ బావ, బామ్మర్దులు తిరుగుతున్నారని, కిరాయి మనుషులతో హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చి, రూ.25 వేలు ఇస్తుంటే అభినందించాల్సి పోయి అన్యాయంగా మాట్లాడుతున్నారని తెలిపారు.