Revanth Reddy | హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన హక్కులను, హామీలను త్వరితగతిన అమలు చేయాలని ప్రధాని నరేంద్రమోదీని కోరినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ర్టానికి సంబంధించిన పలు సమస్యలపై ఆయనకు వినతిపత్రం అందించారు. ఇద్దరు నేతలు సుమారు అరగంట పాటు ప్రధానితో బేటీ అయ్యారు. అనంతరం భట్టి విక్రమార్క ప్రధానితో భేటీ వివరాలను తెలంగాణ భవన్లో మీడియాకు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వపరంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం, ప్రజాస్వామ్య స్ఫూర్తితో తొలిసారిగా దేశ ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం హోదాలో తాను కలిసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విభజన చట్టం హామీలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. బయ్యారం ఉకు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటిఐఆర్ ప్రాజెక్టులను వెంటనే ఏర్పాటు చేయడం కోసం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం 2015 నుంచి 2021 వరకు ప్రతి ఏటా రూ.450 కోట్లు చొప్పున రూ.2250 కోట్లను కేంద్రం విడుదల చేసిందని, 2019-20, 21-22, 22-23, 23-24 సంవత్సరాలకు సంబంధించి పెండింగ్ గ్రాంట్లు రూ.1,800 కోట్లు విడుదల చేయాలని ప్రధానమంత్రిని కోరినట్లు తెలిపారు. పెండింగ్లో ఉంచిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2233.54 కోట్లు (2022-23కు సంబంధించి రూ.129.69 కోట్లు, 2023-24కు సంబంధించి రూ.1608.85 కోట్లు) వెంటనే విడుదల చేయాలని సీఎం, ఉప ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.