నాంపల్లి కోర్టులు, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మూడో నిందితుడు రుద్ర శివకుమార్ ఉదయ్‌సింహ బుధవారం ఈడీ కోర్టు విచారణకు హాజరుకాలేదు. ఈ కేసులో ఇతర నిందితులుగా ఉన్న బిషప్ హర్సీ సెబాస్టియన్ (ఏ2), జెరూసలెం మత్తయ్య (ఏ4), సండ్ర వెంకటవీరయ్య (ఏ5) మాత్రమే కోర్టుకు హాజరయ్యారు. రేవంత్‌రెడ్డి గైర్హాజరులపై మత్తయ్య నిరసన వ్యక్తం చేస్తూ కోర్టు ప్రవేశ ద్వారం వద్ద బైఠాయించారు. 2021 నుంచి ఈ కేసు పురోగతి సాధించకపోవడం, విచారణకు సీఎం రేవంత్ సహకరించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు దృష్టిలో అందరూ సమానమేనని పేర్కొంటూ.. రేవంత్‌ను విచారణకు రప్పించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి మత్తయ్యను అక్కడి నుంచి పంపేశారు. కాగా, ఈడీ కోర్టు జడ్జి సురేశ్ సెలవుపై ఉండటంతో ఈ కేసు విచారణ వచ్చే నెల 14కు వాయిదా పడింది.
సీఎం ఢిల్లీ పర్యటన రద్దు
హైదరాబాద్, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ): సీఎం ఢిల్లీ పర్యటన రద్దయింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం గురువారం జరగాల్సి ఉండగా, పలు కారణాలతో వాయిదా పడింది. దీంతో సీఎం తన టూర్‌ను రద్దు చేసుకున్నారు. వాస్తవానికి సీఎం రేవంత్‌రెడ్డి సమావేశానికి ఒకరోజు ముందుగానే ఢిల్లీ వెళ్లి అధిష్ఠానం పెద్దలను కలుస్తారనే ప్రచారం జరిగింది. ఈ భేటీలోనే మంత్రివర్గ విస్తరణ అంశం సైతం కొలిక్కి వస్తుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా జరుగుతున్నది.