హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టగానే సచివాలయం మొత్తం టీడీపీ తాజా, మాజీ నేతలతో నిండిపోయింది. తెలంగాణ కాంగ్రెస్ నేతల కన్నా ఎక్కువగా ఏపీకి చెందిన పచ్చ చొక్కా నేతలు గుంపులు గుంపులుగా వచ్చి హల్చల్ చేశారు. ఇలా ఎందుకు జరుగుతున్నదని అప్పుడు ఎవరికీ అర్థం కాలేదు. దాని పరిణామాలు ఇప్పుడు క్రమంగా బయటపడుతున్నాయని తెలంగాణవాదులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పేరుకు కాంగ్రెస్ ప్రభుత్వమే అయినా రాష్ట్ర పాలన, ప్రాజెక్టుల్లో ఏపీ సీఎం చంద్రబాబు అండ్ కో నీడలు బాగానే కనిపిస్తున్నాయని చెప్తున్నారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో సత్సంబంధాలు ఉండటం సహజమే అయినా, గత 18 నెలలుగా తెలంగాణలో చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే మాత్రం రేవంత్-బాబు మైత్రి అంతకుమించి అనేలా అనుమానాలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కీలకమైన ప్రాజెక్టుల్లో అత్యధికం చంద్రబాబు బ్యాచ్ పేర్లు తెరపైకి వస్తుండటమే ఇందుకు నిదర్శనం అన్నది తెలంగాణవాదుల వాదన. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా ప్రాజెక్టులను ఉదాత్తంగా కట్టబెడితే తెరవెనుక అధికార పార్టీ నేతల పేర్లు బయటికొస్తాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం విచిత్రంగా టీడీపీ, బీజేపీకి సంబంధించిన వారి పేర్లు బయటికి వస్తున్నాయని చెప్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమీకరించాలనుకుంటే అందుకు తగిన మార్గాలను అన్వేషించి, సూచించేందుకు రాష్ట్రంలో అనేకమంది మేధావులు, ఆర్థిక నిపుణులు, సీనియర్, రిటైర్డ్ అధికారులు ఉన్నారు. కానీ రేవంత్ సర్కారు మాత్రం బాబు బ్యాచ్‌నే నమ్ముకున్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలను తాకట్టు పెట్టి రూ.10వేల కోట్ల నిధులను సమీకరించిన సంగతి తెలిసిందే. ఆ భూముల ధర నిర్ధారణ మొదలు తనఖా పెట్టిన విధానంలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రధానంగా ఈ నిధుల సమీకరణ ప్రక్రియ చేపట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.175 కోట్లను మధ్యవర్తిత్వ కంపెనీకి కమీషన్ ఇచ్చింది. దీనిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించింది ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ అనే ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం అప్పుడే ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీలోనూ బాబు బ్యాచ్‌కు చోటు దక్కింది. రూ.4,300 కోట్లతో ప్రభుత్వం 330 ఫీట్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని చేపడుతున్నది. ఈ మేరకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) రెండు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచి, ఖరారు చేసింది. ఇందులో సుమారు రూ.2 వేల కోట్ల అంచనాతో పిలిచిన 19 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులను రిత్విక్ కంపెనీ దక్కించుకున్నది. ఈ కంపెనీ తెలుగుదేశం పార్టీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, మొన్నటిదాకా అక్కడే ఉండి, ప్రస్తుతం బీజేపీలో చేరిన ఎంపీ సీఎం రమేశ్‌కు చెందినది. రెండు రోజుల కిందట ఢిల్లీలో మీడియా ప్రతినిధులు ఇదే అంశాన్ని ప్రస్తావించగా, టెండర్ల నిబంధనల మేరకే పనులు కట్టబెడతారంటూ సీఎం రేవంత్‌రెడ్డి సమాధానమిచ్చారు. అయితే ముఖ్య నేతల నుంచి అనుమతులు రానిదే బడా ప్రాజెక్టులు కట్టబెట్టడం సాధ్యం కాదని సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి రూ.2 వేల కోట్ల పనుల టెండర్లు ప్రభుత్వ పెద్దల సైగలేనిదే ఖరారు కావని స్పష్టం చేశాయి. ఈ లెక్కన గ్రీన్‌ఫీల్డ్ హైవే పనుల టెండర్లు ముఖ్యనేతకు తెలియకుండా ఖరారు చేసే అవకాశమే లేదని పేర్కొన్నాయి. ఇదో రకమైన క్విడ్ ప్రోకో అని పలువురు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
గడిచిన దశాబ్దకాలంలో రిత్విక్ కంపెనీ ప్రస్తానాన్ని పరిశీలిస్తే తీవ్ర ఆరోపణలు కనిపిస్తాయి. 2023లో రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే రిత్విక్ కంపెనీ కాంగ్రెస్ పార్టీకి రూ.30 కోట్ల బాండ్స్ ఇచ్చింది. అనేక రాష్ర్టాల్లో ప్రాజెక్టు పనులను దక్కించుకొని, తీవ్ర జాప్యం చేయడంతో బిల్లులు నిలిచిపోయాయి. గతంలో తెలంగాణ సాగునీటి రంగంలోనూ ఒక ప్రాజెక్టు పనుల్ని పూర్తి చేయకపోవడంతో ప్రభుత్వం 60-ఎ కింద అసంపూర్తి పనుల్ని ఇతర కంపెనీకి అప్పగించింది. వీటితో పాటు ఈ సంస్థపై రూ. 450 కోట్ల ఫోర్జరీ కేసులు ఉన్నట్టు తెలిసింది. ఇలాంటి కంపెనీకి రేవంత్ ప్రభుత్వం రూ.2 వేల కోట్ల రోడ్ల పనుల్ని అప్పగించింది. కంపెనీ యజమాని సీఎం రమేశ్ గతంలో తెలుగుదేశంలో ఉండేవారని, ఆ తర్వాత బీజేపీలోకి వచ్చి ఎంపీగా కొనసాగుతున్నారని గుర్తు చేస్తున్నారు. ఆ సాన్నిహిత్యంతోనే ప్రాజెక్టు కట్టబెట్టారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారిన ప్రాజెక్టు మూసీ పునర్జీవం. పేదోళ్ల ఇండ్ల కూల్చివేతతో రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. రూ.లక్షన్నర కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును మెయిన్హర్ట్ కన్సార్షియంకు ప్రభుత్వం అప్పగించింది. ఈ ప్రాజెక్టు చంద్రబాబు సన్నిహితుడి చేతికే దక్కడం గమనార్హం. పలు ప్రపంచ దిగ్గజ కంపెనీలు టెండర్లలో పాల్గొన్నా, వాటిని కాదని రేవంత్ సర్కారు మెయిన్హర్ట్కు పెద్ద పీట వేసింది. ఈ కంపెనీలో చంద్రబాబు స్నేహితుడు, సింగపూర్ మాజీ మంత్రి, ప్రస్తుతం అవినీతి కేసుల్లో జైలులో ఉన్న ఈశ్వరన్ ప్రధాన భాగస్వామి. ఆయనకే చెందిన మరో కంపెనీ సెమ్కాప్ అండ్ అసెండర్స్ సింగ్‌బ్రిడ్జి (మెయిన్హర్ట్ అనుబంధ సంస్థ)కే గతంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం అమరావతి నగరాభివృద్ధి బాధ్యతలను అప్పగించింది. అమరావతి రాజధాని గ్రాఫిక్స్ వ్యవహారంలో ఈశ్వరన్‌పై రూ.66వేల కోట్ల అవినీతి ఆరోపణలు వచ్చాయని మీడియాలో కథనాలు వచ్చాయి. అయినా ఆ కంపెనీకే మూసీ ప్రాజెక్టు కట్టబెట్టడంతో తెలంగాణ పాలనలో బాబు మార్క్ కనిపిస్తుందన్నది తెలంగాణ సమాజం ముందు ఆవిష్కృతమైంది.