హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల్లో సీఎం మీటింగ్ చిచ్చురేపింది. ఒక ఉద్యోగ సంఘం ఏర్పాటుచేసిన వేదిక నుంచి సీఎం డీఏ ఇస్తున్నట్టు ప్రకటించడం వివాదానికి దారితీసింది. ఆ సంఘానికి సీఎం అధిక ప్రాధాన్యమివ్వడం, మిగతా సంఘాలు గుర్రుగా ఉన్నా యి. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) డైరీ, క్యాలెండర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సచివాలయంలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే ఆయన సంక్రాంతి కానుకగా ఒక డీఏను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే టీజీవో సంఘం వేదికపై డీఏను ప్రకటించి, ఉద్యోగుల జేఏసీని సీఎం అవమానించారని ఇతర సంఘాలు భావిస్తున్నాయి.
జేఏసీ నేతలందరిని పిలిచి, అందరి సమక్షంలో డీఏ ప్రకటిస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నాయి. టీజీవో సంఘం కూడా జేఏసీతో సంబంధం లేనట్టు వ్యవహరించడం పట్ల మిగతా సంఘాలు ఫైర్ అవుతున్నాయి. ఉద్యోగుల వా ట్సాప్ గ్రూపుల్లో ఇదే అంశంపై మంగళవారం దుమారం చెలరేగింది. ఉద్యోగుల జేఏసీ వాట్సాప్ గ్రూపు నుంచి టీఎన్జీవో సంఘం బాధ్యులంతా వైదొలగారు. మిగతా సంఘాల బాధ్యులు కూడా జేఏసీ గ్రూప్ నుంచి బయటికి రావాలంటూ సందేశాలు పంపించారు. ఉపాధ్యాయ సంఘాలు సైతం టీజీవో వైఖరితో అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. ఉమ్మడిగా ఉద్యమించేందుకు టీచర్ సంఘాలన్నీ రెడీ అవుతున్నాయని.. వాటి నాయకులు జేఏసీ ప్రధాన బాధ్యులకు చెప్పడం గమనార్హం.
దశాబ్దం తర్వాత ఏకతాటిపైకి..
రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారం ధ్యేయంగా తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ 2024లో ఏర్పడింది. తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్లీ ఇన్ని సంఘాలు ఏకతాటిపైకి రావడం ఇదే మొదటిసారి. జేఏసీ ఆధ్వర్యంలో 57 డిమాండ్లు, 200లకు పైగా సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడిగా ఉద్యమించాలని తీర్మానించాయి. గత ఏడాదిన్నర కాలంగా జేఏసీ పలుమార్లు ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. సర్కారు నుంచి నిర్దిష్ట హామీలు రాకుండానే, సమస్యలు పరిష్కారం కాకుండానే జేఏసీ అకస్మాత్తుగా కార్యాచరణను వాయిదా వేసింది. దీంతో ఉద్యోగుల్లో పలుచనవుతున్నామన్న భావనలో మిగతా ఉద్యోగ సంఘాల నేతలున్నారు. సర్కార్‌తో కొట్లాడి, ఢీ అంటే ఢీ అనే చరిత్ర గల సంఘాలు ఇలా కార్యాచరణను వాయిదా వేయడంతో ఉద్యోగుల విశ్వాసాన్ని కోల్పోయామన్న భావనతో నేతలున్నారు.
చీలిక దిశలో జేఏసీ
ఉద్యోగుల జేఏసీలో గత కొంతకాలంగా ఆధిపత్య పోరు సాగుతున్నది. ఇప్పుడది తారస్థాయికి చేరింది. ఇన్నాళ్లు చిన్నచిన్న లుకలుకలుండగా, తాజాగా భారీ ముసలం మొదలయ్యింది. సోమవారం నాటి సీఎం మీటింగ్‌తో విభేదాలు మరింత బహిర్గతమయ్యాయి. మొత్తంగా ఉద్యోగుల జేఏసీ చీలికదిశగా సాగుతున్నది. సంక్రాంతి తర్వాత జేఏసీ చీలడం ఖాయమన్న ప్రచారం జరుగుతున్నది. ఇన్నాళ్లు జేఏసీగా వినతిపత్రాలిచ్చామని, చర్చలు జరిపామని కానీ డీఏ ప్రకటన సమయంలో జేఏసీని పూచికపుల్లతో సమానంగా తీసిపడేనంత పనిచేశారని నేతలు మండిపడుతున్నారు. ఇదే విషయంపై జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. సంక్రాంతి తర్వాత జేఏసీ సమావేశం నిర్వహిస్తామని, అప్పుడే భాగస్వామ్య సంఘాలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ చిన్నచిన్న భేదాలు సహజమని, విశాలహృదయంతో కలుపుకుపోతామన్నారు.