ఉస్మానియా దవాఖాన కొత్త భవన నిర్మాణానికి గోషామహల్ పోలీస్ గ్రౌండ్లో భూమిపూజ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉస్మానియా దవాఖానను గోషామహల్ పోలీస్ స్టేడియంలో నిర్మించవద్దని ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. గోషామహల్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేస్తున్న స్థానికులను అరెస్టు చేస్తున్న పోలీసులు
Osmania Hospital | అబిడ్స్/సుల్తాన్‌బజార్, జనవరి 31: ఉస్మానియా దవాఖానను గోషామహల్ పోలీస్ స్టేడియంలో నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆ ప్రాంత వాసులు వ్యతిరేకిస్తున్నారు. పాతబస్తీలో భౌగోళికంగా ఇరుకుగా ఉండే ప్రాంతంలో భారీ దవాఖాన నిర్మించడం వల్ల ప్రజాజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఉస్మానియా దవాఖాన ఆవరణలోనే విశాలమైన స్థలం ఉన్నదని, అక్కడే కొత్త భవనాలను నిర్మించాలని కోరుతున్నారు. ఇండ్ల మధ్యలో 2000 వేల పడకల దవాఖాన ఏర్పాటు చేస్తే వాహనాల రాకపోకలు, రద్దీ ఎక్కువవుతుందని వివరిస్తున్నారు.
ఆందోళనలు.. అరెస్టులు
ఉస్మానియా దవాఖాన శంకుస్థాపన సందర్భంగా గోషామహల్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. స్టేడియం ఎదుట బీఆర్ఎస్ నియోజకవర్గ నేతలు ఆనంద్‌కుమార్‌గౌడ్, ఆశిష్కుమార్యాదవ్, సురేశ్‌ముదిరాజ్, కార్పొరేటర్ లాల్‌సింగ్ నిరసన తెలిపారు. దవాఖాన ఏర్పాటుకు మద్దతు తెలిపేందుకు వచ్చిన సీపీఎం నేతలను కూడా పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. మద్దతు తెలిపేందుకు వచ్చామని చెప్పినా వినిపించుకోలేదు. కాంగ్రెస్ నేతలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు కట్టడి చేశారు. రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌యాదవ్ పోలీసులకు నచ్చజెప్పి వారిని లోపలికి తీసుకెళ్లారు. ఆఖరికి శంకుస్థాపనలో పాల్గొనేందుకు వచ్చిన దవాఖాన సిబ్బందిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఎంట్రీ పాస్‌లు చూపించినా పట్టించుకోలేదు. ఇలా అడుగడుగునా పోలీసులు స్టేడియంను దిగ్బంధించగా సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసి వెళ్లారు.