రంగారెడ్డి : సర్వ మానవాళికి సమానత్వాన్ని ప్రబోధించిన సమతామూర్తి భగవద్రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు సన్నద్ధమైంది. నేటి నుంచి ఈనెల 14వ తేదీ వరకు కనులపండువగా జరిగే వేడుకలకు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీరామనగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దగా, 108 దివ్యదేశ ఆలయాలు పచ్చందాలు, రంగురంగుల విద్యుత్కాంతుల్లో కళకళలాడుతున్నాయి. దక్షిణభారత్లో తొలిసారి ఆళ్వార్ల విగ్రహ ప్రతిష్ఠాపన కూడా ఈ దివ్యక్షేత్రంలోనే జరగడం విశేషం.
రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా యాగశాలలో వాస్తు శాంతి పూజ బుధవారం మధ్యాహ్నం ముగిసింది. సాయంత్రం 5 గంటలకు సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలకు అంకురార్పణ జరగనుంది. చినజీయర్ స్వామి యాగశాలలో ఈ వేడులకు అంకురార్పణ చేయనున్నారు. ఈ వేడుకల అంకురార్పణకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు.