హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ చారిత్రక వారసత్వం మహోన్నతమైనదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. కోట్లాది సంవత్సరాల చరిత్రకు తెలంగాణ సాక్ష్యంగా నిలవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 20 కోట్ల ఏండ్ల క్రితం నాటి చారిత్రక ఆనవాళ్లు తెలంగాణలో లభ్యం కావడం మనకు గర్వకారణమని చెప్పారు. ఈ దిశగా తెలంగాణ చరిత్రకారులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ సాహిత్య దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ చరిత్రను భావితరాలకు తెలిపే విధంగా భారత జాగృతి సంస్థ ప్రచురించిన తెలంగాణ చరిత్ర పుస్తకం 5 సంపుటాలను ఆదివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిషరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఆయా కాలాల్లో కొనసాగిన సామాజిక పరిస్థితులు, పరిపాలన రీతులు, నాటి దార్శనికతను అర్థం చేసుకుంటే భవిష్యత్తుకు దారి చూపుతాయని చెప్పారు. మన గత చరిత్రను అర్థంచేసుకోవడం, వర్తమానాన్ని అవగాహన చేసుకోవడం ద్వారా భవిష్యత్తుకు బాటలు వేసుకోగలమని తెలిపారు. తెలంగాణ చరిత్ర పుస్తకం తీసుకొచ్చిన జాగృతి చరిత్ర విభాగం బాధ్యులను, జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అభినందించారు.
ప్రముఖ చరిత్రకారుడు, రచయిత శ్రీరామోజు హరగోపాల్ ఆధ్వర్యంలో భారత జాగృతి చరిత్ర విభాగానికి చెందిన పలువురు చరిత్రకారులు గత ఆరేండ్లుగా తెలంగాణలోని అనేక చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. క్షేత్రస్థాయిలో పరిశోధన చేసి సేకరించిన సమాచారాన్ని మామిడి హరికృష్ణ, వేముగంటి మురళీకృష్ణ సంపాదకత్వంలో పుస్తకాలకు రూపకల్పన చేశారు. చరిత్ర రచన కోసం ఆయా ప్రదేశాల్లోని శిలాజాలు, కట్టడాలు, శాసనాలు, నాణాలు, గ్రంథాలు సహా అన్ని రకాల చారిత్రక ఆధారాలను అధ్యయనం చేసినట్టు వారు సీఎంకు వివరించారు. కార్యక్రమంలో శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్, భారత జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ఆచారి తదితరులు పాల్గొన్నారు.