హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): దేశ రాజకీయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల తర్వాత కేంద్రంలో టీఆర్ఎస్ శాసించే ప్రభుత్వం ఏర్పడొచ్చని అన్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనన్నారు. మంగళవారం శాసనసభలో దళితబంధుపై చర్చకు సీఎం సమాధానమిచ్చారు. ‘కొన్ని సందర్భాలు కలిసొస్తయ్. రాజకీయాల్లో చాలా చూసినం. యూపీఏ ప్రభుత్వ సమయంలో మేము ఐదుగురమే ఎంపీలం. కానీ మా అవసరం ఆనాడు అక్కడ ఉండె. రేప్పొద్దున కేంద్రంలో మనం శాసించే ప్రభుత్వం రావొచ్చు, మనకే కీలకమైన పాత్ర రావొచ్చు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వమే మనల్ని కనికరించొచ్చు’ అని అన్నారు. ముఖ్యమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే..
ఏడు కాదు.. బారెడు దరఖాస్తులిస్తం
మనకు రావాల్సిన వాటి గురించి కేంద్ర ప్రభుత్వాన్ని కచ్చితంగా అడుగుతం. ప్రధానమంత్రిని ఎందుకు అడగం! సమస్యల పరిష్కారం కోసం ప్రధానికి ఏడు కాకపోతే బారెడు దరఖాస్తులు ఇస్తం. దళితబంధు కేంద్రం ఇస్తామంటే మేం వద్దంటమా? రెండు చేతుల దండం పెడుతం. కేంద్ర ప్రభుత్వాన్ని నేను ఇప్పటికే అడిగిన. ఒకవేళ కేంద్రం సహకరిస్తే ఇది ఇంకా స్పీడ్ కావొచ్చు. రేపు జరిగే జనరల్ ఎలక్షన్స్ తర్వాత మనకు రాజకీయంగా కలిసొస్తే ఒకటే ఏడాది 5 లక్షల మంది దళితబంధు తీసుకోవచ్చు. వీలైనంత వేగంగా ఈ కార్యక్రమాన్ని సంపూర్ణం చేయాలని ఆలోచిస్తున్నా.
ప్రధాని.. మీదేమైనా వేరే దేశమా? అన్నరు
గతంలో మన పిల్లలకు రావాల్సిన ఉద్యోగాలను ఇతరులు గద్దల్లా తన్నుకుపోయారు. గతిలేని పరిస్థితుల్లో మనమంతా చూస్తూ ఉండిపోయినం. రాష్ట్రం కోసం పోరాడినం కాబట్టి లోటుపాట్లు మాకు తెలుసు. కొత్త జోన్లను క్యాబినెట్ ఆమోదించి పంపించిన తర్వాత దాన్ని ఆమోదించేందుకు కేంద్రం ఏడు నెలల సమయం తీసుకున్నది. ఈ జోనల్ విధానం ప్రకారం 95% ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక యువతకు దక్కేలా చేసినం. ఈ విధానాన్ని కేంద్రంతో ఒప్పించేందుకు నేను మూడు చెరువుల నీళ్లు తాగిన. ఢిల్లీకి పది చెక్కర్లు కొట్టిన. చివరికి ప్రధానిని కలిసి పెద్ద గొడవ చేసి.. సార్ మాకు ఈ సమస్య ఉన్నదని చెప్పిన. ప్రధానమంత్రి.. ‘ఏమయ్యా మీదేమైనా వేరే దేశమా? 95% రిజర్వ్ పెడతరా?’ అన్నరు. ‘సార్ మా బాధను అర్థం చేసుకోండి. ఇంతకు ముందు మమ్మల్ని ఎవరైతే ఎక్స్‌ప్లాయిట్ చేశారో, మా పక్క రాష్ట్రం వాళ్లు కూడా మేం మాట్లాడే భాషనే మాట్లాడుతరు. ఓపెన్ కోటా పెడితే మా పిల్లలకు వాళ్లు కూడా పోటీ వస్తరు’ అని చెప్పిన. ఈ ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకోవాలని కోరితే ప్రధానమంత్రి ఒప్పుకొన్నరు. దీంతో ఈ రోజు 95% రిజర్వేషన్లు తెలంగాణ బిడ్డలకు దక్కినయ్. ఇదీ టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ఘనత.
కేంద్రం కులగణన ఎందుకు చేపట్టదు?
బీసీ కులగణన చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నది. కేంద్రం కులగణనకు నిరాకరిస్తున్నది. సుప్రీంకోర్టులో మేం చేయలేమని అఫిడవిట్ వేసింది. తప్పకుండా బీసీల కులగణన జరగాలి. మనం కూడా కులగణనపై శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుదాం. సంక్షేమ పథకం ఏది అమలు చేయాలన్నా మొదట జనాభా లెక్కలు ప్రభుత్వం వద్ద ఉండాలి. లెక్కలు లేకుండా చేయడం కష్టం. తమ జనాభా గణన జరగాలని బీసీలు కూడా అడుగుతున్నారు. ఎవరెంత ఉన్నారో లెక్కతేలాలి. దళితుల జనాభా ఒక్కో జిల్లాలో ఒక రకంగా ఉన్నది. లెక్కలు తెలియకుండానే మాట్లాడుతుంటారు. ప్రభుత్వ సర్వే ప్రకారం రాష్ట్రంలో కోటి 3 లక్షల కుటుంబాలుంటే అందులో దాదాపు 18 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి.
చట్టంలో ఉన్నా నవోదయ స్కూళ్లు ఇస్తలేదు
నవోదయ పాఠశాలలకు సంబంధించి రాష్ట్ర విభజన చట్టంలోనే ఉన్నది. ‘ఏంది సార్ మీరు చట్టాన్ని కూడా అమలు చేయడంలేదు.. ఇది అన్యాయం’ అని నేను మొన్న ప్రధానమంత్రిని అడిగిన.. చట్ట ప్రకారం ప్రతి జిల్లాకో నవోదయ పాఠశాల రావాలె.. కానీ రాలేదు. ఏడేండ్లుగా అడుగుతున్నం. ఇన్నేండ్లు జిల్లాలు కాలేదు కాబట్టి మనకు నష్టం జరిగింది. ఇప్పుడు కొత్త జిల్లాలైనా కేంద్రం ఇస్తలేదు. స్కూళ్లు మన హక్కు.