CM KCR | స్టేషన్ ఘన్పూర్ : స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి చెందిన ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య 58 బోర్లు వేస్తే చుక్క నీరు రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని కడియం శ్రీహరికి మద్దతుగా ప్రసంగించారు.
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని మాణిక్యపురం అనే గ్రామంలో చుక్క సత్తయ్య అనే పేరుమోసిన ఒగ్గు కళాకారుడు ఉండే. నీళ్లు పడకపోతే 58 బోర్లు వేసిండు ఆయన పాపం. ఆ బోర్లు వేసుడు ఎంత బాధ. ఒకడు కొబ్బరికాయ, ఒకడు తాళపుచెవిల గుత్తి, ఒకడు తంగేడు పుల్ల పట్టుకొని వస్తడు. ఎన్నికల రకాల బాధలు చూశాం. అవస్థలు పడ్డాం. మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలితే బాధ అయింది. చుక్క సత్తయ్య తన ఒగ్గు కథల మీద వచ్చిన పైసలన్నీ ఆ బోరు పొక్కల్లోనే పోశారు. 58 బోర్లు వేస్తే చుక్క నీరు రాలేదు. ఇది చుక్క సత్తయ్య కథ. ఇంత ఘోరం ఉండే స్టేషన్ ఘన్పూర్లో. ఎక్కడ నీళ్లు లేకుండే. దేవాదుల కాడ పనులు జరగకపోతే ఇదేం స్కీం రా నాయనా అని పోయి పిండం పెట్టి వచ్చిండు ఎమ్మెల్యే రాజయ్య. పిండం పెట్టి ఆనాడు ప్రభుత్వాన్ని నిలదీశాడు. మీరు బేకార్ గాళ్లు అని మండిపడ్డారని కేసీఆర్ తెలిపారు.
ఇలా అనేక బాధలు ఉండే. ఆ బాధలన్నీ ఇవాళ లేవు. ఒక లక్షా 10 వేల ఎకరాలకు సస్యశ్యామలంగా నీళ్లు పారుతున్నాయి. వేలేరుకు నీళ్లు రావాలని కొట్లాడి తెచ్చుకున్నారు. మల్కపురం రిజర్వాయర్ కావాలని కడియం శ్రీహరి కోరుతా ఉండే. ఇట్ల నీళ్ల కోసం ఇక్కడి బిడ్డలు తండ్లడారు కాబట్టి.. గవర్నమెంట్ సహకరించింది కాబట్టి లక్ష 10 వేల ఎకరాలకు నీళ్లు వచ్చాయి. కనీసం ఇంత పంటలు పండించుకుని ఒక తెలివికి వచ్చాం. బోర్ల బాధ, కరెంట్ బాధ తప్పింది. వాగులు, నదుల మీద చెక్ డ్యాంలు కట్టుకున్నాం. భూగర్భ జలాలు పెరిగాయి. బోర్లలో నీళ్లు మంచిగా వస్తున్నాయి. రైతాంగానికి దేవాదుల ద్వారా నీళ్లు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ముక్కు పిండి నీళ్ల ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. కానీ మన దగ్గర నీటి తిరువా రద్దు చేశామని కేసీఆర్ స్పష్టం చేశారు.