హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని దేవరయాంజాల్‌లో ఉన్న సీతారాములవారి ఆలయ మాన్యం భూములను కాపాడుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఈ భూముల అన్యాక్రాంతంపై ఇప్పటికే నలుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశామని గుర్తుచేశారు. అసెంబ్లీలో మంగళవారం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆలయాల మాన్యం భూములు అన్యాక్రాంతం కాకుండా కఠిన చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు.
దేశంలోని ఆలయాల భూములు అన్యాక్రాంతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు కూడా కఠినమైన ఆదేశాలిచ్చిందని గుర్తుచేశారు. ‘దేవరయాంజాల్ రాములవారి ఆలయానికి సంబంధించిన భూములపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో నలుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీ కూడా వేశాం. ఆ కమిటీ రిపోర్ట్ దాదాపు పూర్తయిందని చెప్పింది. రిపోర్ట్ ప్రభుత్వానికి అందగానే దేవాలయానికి సంబంధించిన గజం భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా దేవుని మాన్యం దేవునికే దక్కేలా ప్రభుత్వం కాపాడుతుంది’ అని స్పష్టంచేశారు.