CM KCR | హైదరాబాద్ : రాష్ట్రంలో వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ తదితర అంశాలపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారు. వీరిలో నిరక్షరాస్యులు, ఏడో తరగతి పాసైనవారు, పది పాసైనవారు, ఇంటర్మీడియేట్ వరకు మాత్రమే చదివి పాసైనవారు, డిగ్రీ ఆపై ఉన్నత చదువులు చదివినవారు ఉన్నారు. వీరి విద్యార్హతను బట్టి ప్రభుత్వం ఉద్యోగ కేటగిరీలను నిర్ధారిస్తుంది. నిబంధనలకు అనుగుణంగా ఆయా శాఖల్లో వారిని భర్తీ చేస్తాం అని సీఎం తెలిపారు.
ఉన్నత చదువులు చదివి ప్రమోషన్లకు అర్హులైన వారికి అందుకనుగుణమైన పోస్టుల్లో భర్తీ చేయనున్నట్టు సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టి, విధివిధానాలు ఖరారు చేసి, రేపు (సోమవారం) ఉత్తర్వులు జారీ చేయాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
61 ఏండ్లు పైబడిన వీఆర్ఏల వారసులకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు సీఎం నిర్ణయించారు. అదేవిధంగా… 2 జూన్ 2014 అనంతరం 61 ఏండ్ల లోపు ఉండి ఏ కారణం చేతనైనా వీఆర్ఏ విధులు నిర్వహిస్తూ మరణించిన వీఆర్ఎ వారసులకు కూడా ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. కాగా… చనిపోయిన వీఆర్ఏల వారసుల వివరాలు, వారి విద్యార్హతలు త్వరలో సేకరించాలని అధికారులను వీఆర్ఏ జేఏసీ నేతలకు తెలిపారు. వీరికి కూడా నిబంధనలకు అనుసరించి అర్హతల మేరకు, ఆయా శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో సర్దుబాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.