CM KCR | హైదరాబాద్ : శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిర్వహించిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది. చంద్రయాన్-3ని ఇస్రో విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్, శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక సిబ్బందిని అభినందిస్తూ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్ 3 విజయవంతం కావడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన రంగం.. కీలక మైలురాయిని దాటిందని సీఎం అన్నారు.
ఇస్రో మరో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. చంద్రుడి దిశగా చంద్రయాన్-3(Chandrayaan-3) పయనమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ సెంటర్ నుంచి ఇవాళ ఎల్వీఎం3 ఎం4 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. చంద్రయాన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ఆ రాకెట్ మోసుకువెళ్లింది. ఇవాళ మధ్యాహ్నం 2.35 నిమిషాలకు రాకెట్ గాలిలోకి ఎగిరింది. ఆ తర్వాత అన్ని దశల్లోనూ ఆ రాకెట్ బూస్టర్లు సక్రమంగా మండాయి. ల్యాండర్, రోవర్‌తో చంద్రయాన్-3 వెళ్తోంది. ఆగస్టు 23వ తేదీన చంద్రుడిపై ఆ ల్యాండర్ దిగే అవకాశాలు ఉన్నాయి. చంద్రుడి ఉపరితలాన్ని అధ్యయనం చేసేందుకు పేలోడ్‌లో ప్రత్యేక పరికరాన్ని పంపుతున్నారు.