CM KCR | సీఎం కేసీఆర్ సూర్యాపేటలో పర్యటిస్తున్నారు. కాసేపటి క్రితమే ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరి ప్రత్యేక హెలికాప్టర్లో సూర్యాపేట చేరుకున్నారు. పట్టణంలో రూ.500 కోట్లతో నిర్మిస్తున్న వైద్య కళాశాలకు సంబంధించి పూర్తయిన ప్రధాన భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం రూ.40 కోట్లతో పాత వ్యవసాయ మార్కెట్లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్‌ను అందుబాటులోకి తెస్తారు.
ఆ తరువాత జిల్లా పోలీసు కార్యాలయం, ఆ సమీపంలోనే ఉన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం రూ.50 కోట్లతో 21 ఎకరాల్లో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించి, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో కొత్త వ్యవసాయ మార్కెట్ సమీపంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. సాయంత్రం 4.50 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి జగదీశ్‌రెడ్డి శనివారం పరిశీలించారు. అధికారులు సైతం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. సీఎం కేసీఆర్ కటౌట్లు, పార్టీ తోరణాలతో సూర్యాపేట జిల్లా కేంద్రం మొత్తం గులాబీమయంగా మారింది. నూతన భవనాలు విద్యుత్తు కాంతుల్లో జిగేల్మంటున్నాయి.