నిజామాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జనం.. జనం. జనం.. ఎటు చూసినా జనమే.. గులాబీ జెండా ప్రభంజనమే. ఇసుకవేస్తే రాలనంత.. జోరు వాన కూడా నేల చేరలేనంత.. భూమికి ఎండ తగలకుండా చిక్కని గులాబీ గొడుగు పట్టినంత.. ఇందూరు జనసంద్రమై ఉప్పొంగింది. నిజామాబాద్‌లో సోమవారం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సభ తెలంగాణ ఉద్యమ కాలంనాటి కేసీఆర్ సభలను తలపించింది. పట్టణం పరిసరాలన్నీ గులాబీ రంగు పులుముకొన్నాయి. భూనభోంతరాలు దద్దరిల్లేలా జై కేసీఆర్.. జై టీఆర్ఎస్ నినాదాలు మార్మోగాయి.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని 9 నియోజకవర్గాల నుంచి ఏ దారి చూసినా గులాబీ దండుయాత్రే.. ఏ వీధి చూసినా గులాబీ సైన్యం కవాతులే.. భగభగ మండే ఎండనూ లెక్కచేయక.. ఇష్ట నాయకుడిని చూసి, చెప్పేది వినేందుకు యువతతోపాటు వృద్ధులు, మహిళలు, చంటి బిడ్డలతో తల్లులు కూడా ఇందూరు బాట పట్టారు. సీఎం కేసీఆర్ ప్రసంగానికి రెండు గంటల ముందే జనమంతా సభా ప్రాంగణానికి చేరి క్రమశిక్షణగల గులాబీ సైనికులమని నిరూపించారు. పార్కింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడంతో ఇబ్బందులు తలెత్తలేదు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి పోలీస్ శాఖతో సమన్వయం చేసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకొన్నారు. ఎండ ఎక్కువగా ఉండటంతో సభికులకు 2 లక్షల వాటర్ ప్యాకెట్లను టీఆర్ఎస్ శ్రేణులు పంపిణీ చేశాయి. సభ ‘దేశ్‌కి నేత కేసీఆర్’ అనే నినాదాలతో మార్మోగిపోయింది. టీఆర్ఎస్ నాయకుల ప్రసంగాలు ప్రజల్లో ఆసక్తికర చర్చకు తెరతీశాయి.

సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు: వేముల
ఖలీల్‌వాడి / బోధన్, సెప్టెంబర్ 5: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతన సమీకృత కలెక్టరేట్‌ను రూ. 58 కోట్లతో నిర్మించి జిల్లా ప్రజలకు సీఎం కేసీఆర్ అంకితం చేయడం శుభదాయకమని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు అన్ని హంగులతో కూడిన నూతన కలెక్టరేట్‌ను ఇవ్వడంతోపాటు టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం భవనాన్ని ఇచ్చి, వాటిని సీఎం స్వయంగా ప్రారంభించటం గర్వకారణమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
కేసీఆర్ సార్‌తోనే అందరం బాగుంటాం
కేసీఆర్ సార్ పరిపాలన మరింత కాలం కొనసాగితేనే అందరం బాగుంటాం. ఎవరికి ఏం కావాలో, ఏం చేయాలో కేసీఆర్‌కు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. ఎందరో పేదలు కేసీఆర్ మానవీయ పాలనతో భరోసాతో బతుకుతున్నారు. అందుకే ఆయన సభలకు తప్పకుండా హాజరు కావాలనిపిస్తుంది.
-పోచయ్య, రైతు, బోధన్
ఆడబిడ్డల మేనమామను చూద్దామని అచ్చినం
మునుపు గరీబోళ్ల ఇండ్లల్లో ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులకు భారంగా ఉండేది. కేసీఆర్ సార్ సీఎం అయినంక షాదీముబారక్, కల్యాణలక్ష్మీ స్కీమ్‌లు పెట్టి లక్ష రూపాయలు ఇంటికి పంపిస్తున్నారు. గరీబ్ కుటుంబాల ఆడబిడ్డలకు మేనమామ లెక్క ఇంత అండగా నిలబడుతున్న కేసీఆర్‌ను చూసి పోదామని సభకు వచ్చిన.
– రాథోడ్ జమున, అమ్రాద్ తండా
కేసీఆర్‌తోనే కులవృత్తులకు భరోసా
కేసీఆర్ సార్ వచ్చినంక కుల వృత్తుల పనివాళ్లు నాలుగు పైసలు సంపాదించుకునే మార్గం ఏర్పడ్డది. ఏ కులవృత్తి వాళ్లకు ఆ రకమైన పనులు చేసుకునేలా మద్దతు ఇచ్చే కార్యక్రమాలను కేసీఆర్ అందిస్తున్నారు. అన్నం పెట్టే రైతులకే కాకుండా అందరికీ ఆయన అండగా ఉంటున్నారు. మా మద్దతు కేసీఆర్‌కు ఎప్పుడూ ఉంటుంది.
-చాకలి బాలయ్య, కామారెడ్డి