ఉమ్మడి పాలనలో అభివృద్ధికి బహుదూరంగా నిలిచిని ఖమ్మం జిల్లా స్వరాష్ట్రంలో అభివృద్ధికి గుమ్మంగా మారింది. ఆనాటి పాలకుల కుట్రల ఫలితంగా అడుగడుగునా దగాపడ్డ పోరుగడ్డ నేడు ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ ఖమ్మం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. నిధుల వరద పారించారు. అభివృద్ధి, సంక్షేమంలో జిల్లాను ప్రగతిపథం పట్టించారు. జిల్లాలో సాగు సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో భద్రాద్రి జిల్లాలోని అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్టును నిర్మాణాన్ని శరవేగంగా పూర్తిచేస్తున్నారు. జిల్లాలోని నిరుద్యోగులకు ఉన్నచోటే ఐటీ కొలువులు వచ్చేలా ఐటీహబ్‌ను ఏర్పాటు చేశారు. ఖమ్మం నగరాన్ని హైదరాబాద్‌స్థాయిలో అభివృద్ధి బాటపట్టించి ఆదర్శంగా నిలిపారు.
ఖమ్మం, జనవరి 17 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): ఎనిమిదేండ్లలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతున్నది. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధపెట్టడంతో యావత్ తెలంగాణకే తలమానికంగా రూపుదిద్దుకొంటున్నది. జిల్లాలో రహదారుల అభివృద్ధికి తెలంగాణ సర్కారు రూ.890 కోట్లు మంజూరు చేసింది. 10 బ్రిడ్జి కం చెక్‌డ్యాం పనులకు రూ.119 కోట్లతో పనులు పూర్తయ్యాయి. సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు నాలుగు లేన్ల జాతీయ రహదారి విస్తరణకు 306 ఎకరాల భూ సేకరణ పూర్తిచేశారు. రూ.1,039 కోట్లతో ఖమ్మం-కోదాడ జాతీయ రహదారికి కూడా భూ సేకరణ పూర్తయ్యింది. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్‌కు రూ.687 కోట్లతో భూసేకరణ చేశారు. భద్రాచలం నుం చి సత్తుపల్లి వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి 308 ఎకరాలను సేకరించి, పనులు పూర్తి చేశారు.
ఉమ్మడి జిల్లాలో సాగు సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ సర్కారు భద్రాద్రి జిల్లాలోని అశ్వాపురం మండలం బీజీ కొత్తూరువద్ద గోదావరిపై సీతారామ ప్రాజెక్టును నిర్మిస్తున్నది. ఈ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిస్తూ నిధులు కేటాయించారు. పాలేరు లింక్ కెనాల్ పనులను ముమ్మరంగా చేపడుతున్నారు. ఖమ్మం జిల్లాలోని ఐదు మండలాలకు చెందిన 15 గ్రామాల్లో 1,717 ఎకరాల భూ సేకరణ అవసరం కాగా, ఇప్పటివరకు 1,570 ఎకరాలకు అవార్డు జారీ చేశారు.
ఈ నిర్మాణం పూర్తయితే గోదావరి జలాలు పాలేరు రిజర్వాయర్‌లోకి రానున్నాయి. దీంతో గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం పూర్తవుతుంది. సాగునీటి గోసతీరి ఆయకట్టు భూములన్నీ సస్యశ్యామలం కానున్నాయి. పాలేరు వరకు వచ్చే సీతారామ కాలువ ద్వారా జిల్లాలోని జలాశయాలు నిండుతాయి. ఖమ్మం జిల్లాలో సుమారు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
దళితుల జీవితాల్లో వెలుగు నింపేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దళిత బంధు పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. జిల్లాలో చింతకాని మండలంలోని 3,440 మందికి, మిగిలిన నియోజకవర్గాల్లో 483 మంది లబ్ధిదారులకు దళితబంధు యూనిట్లను మంజూరు చేశారు. ఆసరా పింఛన్ పథకం కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, గీత కార్మికులకు రూ. 2,016, దివ్యాంగులకు రూ. 3,016 చొప్పున చెల్లిస్తున్నారు. కల్యాణలక్ష్మి ద్వారా 7,371 మంది ఆడపిల్లలకు రూ.74 కోట్లు, షాదీముబారక్ ద్వారా 346 మంది లబ్ధిదారులకు రూ.3.46 కోట్లు అందజేశారు. జిల్లాలో 5,243 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిచేశారు. 4,790 మంది నిరుపేదలకు ఇండ్ల పట్టాలు అందజేశారు. జిల్లాలో రైతు పెట్టుబడి సాయం కింద 3,07,620 మంది రైతులకు రూ.355.43 కోట్ల్లను వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు. రైతు బీమా కింద 612 మంది నామినీలకు రూ. 3.60 కోట్లను అందజేశారు. 2022-23 సంవత్సరానికి గాను 2,94,986 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు అందించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలో 129 క్లస్టర్లలో రూ.29 కోట్లతో రైతు వేదికలను నిర్మించారు. ఖమ్మం జిల్లాలో 80 శాతం ధరణి దరఖాస్తులను పరిష్కరించారు. తెలంగాణ హరితహారం ద్వారా రాష్ట్రంలో 3.67 శాతానికి పచ్చదనం పెరిగిం ది. జిల్లాలో గత ఏడాది 55.87 లక్షలు, ఈ ఏడాది 1.13 కోట్ల మొక్కలు నాటారు. ప్రతి మండలంలో 5 బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. రూ.1,308 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం కింద 969 గ్రామాలకు తాగునీటి సరఫరా చేస్తున్నారు.
రైతులు పండించిన పంటలకు తెలంగాణ సర్కారు భరోసా కల్పించింది. ఇందులో భాగంగా రఘునాథపాలెం మండలంలో వేర్ హౌజింగ్ కార్పొరేషన్ ద్వారా 20 వేల మెట్రిక్ టన్నులతో రూ.14.90 కోట్ల వ్యయంతో మూడు గోదాములు నిర్మించింది. ఖమ్మం..ఆదర్శ నగరం తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఖమ్మం నగర రూపు రేఖలు మారిపోయాయి. నగరం నడిబొడ్డున 4 ఎకరాల స్థలంలో రూ.22 కోట్లతో నూతన కార్పొరేషన్ భవనాన్ని నిర్మించారు. ఖమ్మం పాత కార్పొషన్ కార్యాలయంలో లైబ్రరీ ఏర్పాటు చేశారు. రూ.4 కోట్లతో లకారం ట్యాంక్‌బండ్‌ను సుందరీకరించారు. రూ. 8.75 కోట్లతో లకారం వద్ద తీగల వంతెనను (కేబుల్ బ్రిడ్జి), మరో రూ. 2 లక్షలతో మ్యూజికల్ ఫౌంటెయిన్‌ను నిర్మించారు. రూ.93.70 లక్షలతో జడ్పీసెంటర్ నుంచి ఐటీ హబ్ వరకు పుట్‌పాత్ జోన్ నిర్మించారు. దానవాయిగూడెంలో రూ. 5.48 కోట్లతో మానవ వ్యర్థాల శుద్ధీకరణ కర్మాగారాన్ని నిర్మించారు. పారిశుధ్య నిర్వహణకు రూ.కోటి 73 లక్షలతో 10 ట్రాక్టర్లు, 15 ఆటోలను కొనుగోలు చేశారు. నగరంలో రూ. 9 కోట్లతో 25,520 ఎల్ఈడీ వీధిదీపాలు ఏర్పాటు చేశారు. రూ.35 కోట్లతో 6.5 కిలో మీటర్ల బీటీ రోడ్డు, 9.6 కిలో మీటర్ల సీసీ రోడ్డు నిర్మించారు. అన్ని డివిజన్ల అభివృద్ధికి రూ.7.52 కోట్లను విడుదల చేశారు.
ఉమ్మడి ఖమ్మంజిల్లా నిరుద్యోగులకు ఉన్నచోటే ఉద్యోగాలు కల్పించేందుకు ఇల్లెందు క్రాస్‌రోడ్డులో ఐటీ హబ్ ఏర్పాటు చేశారు. ఈ నిర్మాణానికి రూ.25 కోట్లు కేటాయించారు. ఈ టీ హబ్‌ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ 2020 డిసెంబర్లో ప్రారంభించారు. ఇందు లో నైపుణ్యం గల యువతకు ఉపాధి కల్పిస్తున్నారు.
రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచేలా ఖమ్మం ప్రధాన ప్రయాణ ప్రాంగణాన్ని హైటెక్ హంగులతో నిర్మించారు. ఖమ్మం బైపాస్ రోడ్డులో ఏడు ఎకరాల స్థలంలో అత్యాధునిక వసతులతో నిర్మాణం పూర్తిచేశారు. రూ. 25 కోట్ల వ్యయంతో 30 ప్లాట్ఫారాలతో బస్టాండ్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దారు. హోటళ్లు, షాపింగ్‌మాల్స్‌తోపాటు విశ్రాంతి గదులు, కొరియర్ స్టాండ్, ఆటోలు, ద్విచక్రవాహనాలు, కార్ల పార్కింగ్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద బస్టాండ్‌గా ఇది కితాబు అందుకుంటున్నది.
పరిపాలనా సౌలభ్యం.. ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఖమ్మం వైరా ప్రధాన రహదారి వీ వెంకటాయపాలెం వద్ద తెలంగాణ సర్కారు నయా కలెక్టరేట్‌ను నిర్మించింది. వెయ్యి అడుగుల ఫేసింగ్, 11 వందల అడుగుల లోతు ఉండేలా చేపట్టే ఖమ్మం సమీకృత కలెక్టరేట్ నిర్మాణానికి మొత్తం రూ.53.20 కోట్లను కేటాయించింది. అన్ని వసతులతో అత్యంత సౌకర్యవంతంగా సమీకృత కలెక్టరేట్ రూపుదిద్దుకొన్నది.