CM KCR | (నాగ్‌పూర్ నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి) :బీఆర్ఎస్ అంటే మిషన్ అని, దేశంలో పరివర్తన తేవడమే లక్ష్యమని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదం కాదని..విధానమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్కు అధికారం ఇస్తే పరివర్తన అంటే ఏమిటో రుచి చూపిస్తామని తెలిపారు. గురువారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం సురేశ్భట్ ఆడిటోరియంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. మహారాష్ట్ర పవిత్ర భూమికి ప్రణామం చేస్తున్నా అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. భారతదేశానికి ఉన్న లక్ష్యం ఏమిటి? తన లక్ష్యానికి చేరుతున్నదా? తన స్థితిని పోగొట్టుకుంటున్నదా?.. దీనిపై ఇప్పటికీ ఎవరికి సమాధానం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రపంచంలోనే అత్యధిక జనసంఖ్య.. సహజ వనరులు ఉన్న దేశం మనది. 140 కోట్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న మన దేశం ఇవాళ ఏ స్థితిలో ఉండాలె? ఎట్లున్నం?’ అని ప్రశ్నించారు.
ఎన్నికల్లో గెలుపే లక్ష్యమా?
దేశంలో ఎన్నికల్లో గెలువడమే అన్ని రాజకీయ పార్టీలకు లక్ష్యంగా మారిపోయిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే కర్ణాటకలో ఎన్నికలు జరిగాయని, అక్కడ బీజేపీ పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ప్రజలకు జరిగిన మేలేంటి? అని ప్రశ్నించారు. ఏదైనా పరివర్తన వచ్చిందా? అని అడిగారు. ప్రతీ ఎన్నికల్లో ప్రజలు గెలువాలని ఆయన విస్పష్టం చేశారు. దేశంలో వ్యవసాయంపై ఆధారపడిన వారే 70 శాతం మంది ఉన్నారని, దురదృష్టవశాత్తు 70 శాతం మందిని వదిలేసి.. దేశంలో రాజకీయ పార్టీలు తమాషా చూస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలు బంగారం అడుగుతున్నారా?
75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇది సిగ్గుపడాల్సిన విషయమని పేర్కొన్నారు. ‘ప్రజలు సూర్యచంద్రులను కోరడం లేదు. తినేందుకు బంగారం అడుగతలేరు. తాగేందుకు నీళ్లివ్వండి. చాలినంత కరెంట్ ఇవ్వండి’ అని మాత్రమే అడుగుతున్నారని చెప్పారు. తాము పండించిన పంటలకు సరైన ధర ఇవ్వమని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారని అన్నారు. కనీస అవసరాలు.. కోరికలను ప్రభుత్వాలు తీర్చకపోవడంవల్ల భారతదేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో దురదృష్టవశాత్తు రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయని, ఇది దుఃఖించాల్సిన విషయమని పేర్కొన్నారు.
నదులున్న రాష్ట్రంలో తాగునీటి కటకట
మహారాష్ట్రలో ఉన్నన్ని నదులు మరే రాష్ట్రంలోనూ లేవని, అయినా ఎక్కడికిపోయినా తాగేందుకు నీళ్లు దొరకని దయనీయ పరిస్థితి నెలకొన్నదని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. మహారాష్ట్రలో ఒక్కో పట్టణంలో తాగునీటి కోసం పది, పదకొండు రోజులు ఎదురుచూడాల్సిందేనా? అని ప్రశ్నించారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఒక్క మహారాష్ట్ర మాత్రమే కాదు.. దేశ రాజధాని ఢిల్లీలోనూ స్వచ్ఛమైన తాగునీరు ప్రతీ రోజూ రావడం లేదని, ట్యాంకర్లు కొనని ఇల్లు ఉండదని తెలిపారు. ఇప్పటికీ ఢిల్లీలో కరెంట్ కోతలున్నాయని, దీనికి కారణం ఏమిటని ప్రశ్నించారు.
పల్లె అయినా, పట్నం అయినా, ఆదివాసీ గూడెం అయినా తెలంగాణలో ఏ మహిళా బిందె ఎత్తుకుని రోడ్డుమీదికి రాదు. ఇంటింటికి శుద్ధజలం అందుతున్నది. తెలంగాణలాంటి చిన్న రాష్ట్రంలో సాధ్యమైనప్పుడు.. మహారాష్ట్రలాంటి రాష్ట్రంలో ఎందుకు సాధ్యపడదు?
– సీఎం కేసీఆర్
భారత్ పరివర్తనే బీఆర్ఎస్ లక్ష్యం
బీఆర్ఎస్ సాధారణ రాజకీయ పార్టీ కాదని, బీఆర్ఎస్ అంటే మిషన్ అని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. మహారాష్ట్రలో రైతులకోసం శరద్‌జోషి అనేక పోరాటాలు చేసినా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదని గుర్తుచేశారు. ఇప్పటికీ ఉల్లిగడ్డ ధరలు పెంచాలని వందలు.. వేల కిలోమీటర్లు కాదని నాసిక్ నుంచి ముంబై దాకా రైతులు, మహిళా రైతులు పాదయాత్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి పాదాల నుంచి నెత్తురు కారుతున్నా ఫలితం లేకుండా పోతున్నదని అన్నారు. ఇదేనా రాజనీతి?.. ఇదేనా ప్రజాస్వామ్యం? అని నిలదీశారు. ఇందుకోసమేనా మన స్వాతంత్య్ర సమరయోధులు మనకు స్వాతంత్య్రం తెచ్చింది? అని నిప్పులు చెరిగారు. రాజకీయాల్లో ఈ సారి ప్రజలు గెలువాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ‘ఇప్పటివరకూ ఎంతోమంది నేతలు దేశాన్ని పాలించినా ఏ ఒక్కరూ మార్పును తీసుకురాలేకపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య వికాసం కోసం పార్టీలు ఉండాల్సిందేనని, మంచి పనులు చేసే పార్టీలకు ప్రజలు అవకాశాలు కల్పిస్తారని పేర్కొన్నారు. కేవలం మహారాష్ట్ర రాజకీయాలు, పరిస్థితులే కాదు యావత్తు దేశ గతిని మార్చటమే బీఆర్ఎస్ లక్ష్యమని స్పష్టం చేశారు. దేశ స్వాతంత్య్ర పోరాటం, నిరంకుశత్వం నుంచి ప్రజాస్వామ్యం ఇలా ప్రతీ దేశం పరివర్తన చెందే క్రమంలో అంబేద్కర్‌వంటి బుద్ధిజీవి నేతృత్వంలో రాజ్యాంగం రూపొందిందని తెలిపారు. దశాబ్దానికో.. రెండు దశాబ్దాలకో దేశ పరిస్థితి మారుతుందని అందరూ ఆశించారని, అయితే 75 ఏండ్లు గడచిపోయినా.. ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉన్నదని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నీ ఉన్నా… దేశగతి ఎందుకు మారడంలేదు?
మేధావులు, బుద్ధిజీవులు, రాజకీయ పార్టీలు అనేకం ఉన్నా దేశం గతి ఎందుకు మారడం లేదని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఇది చాలా దయనీయ పరిస్థితి అని పేర్కొన్నారు. బుద్ధిజీవులు, యువకులు ఈ దేశం గతిని మార్చేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశం దుస్థితిపై ఆలోచించి చర్చపెట్టాలని కోరారు. జాతి జాగృతం కావాల్సిన సమయం ఆసన్నమైనదని, ఈ సమయంలో మౌనంగా ఉండకూడదని ఉద్బోధించారు. దేశంలో ఎన్నికలు వస్తాయి..పోతాయని, కానీ దేశం తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని పేర్కొన్నారు. దేశంలో పుష్కలమైన నీటి వనరులున్నాయని, ప్రకృతి ఇచ్చిన నీటిలో సగం సముద్రం పాలు అవుతున్నాయని టీఎంసీలతో సహా వివరించారు. ప్రపంచంలోనే సాగుయోగ్యభూమి అత్యధికంగా ఉన్న దేశం మనదేనని, అయినా దేశం పరిస్థితి ఇలా ఎందుకున్నదని ప్రశ్నించారు. అమెరికా, రష్యా దేశాల ముందు దేశం భిక్షం ఎత్తుకోవాల్సిన పనిలేదని అన్నారు.
తన పాపం కడుక్కొన్న అమెరికా
దేశంలో దళితుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నదని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై అన్యాయాలు.. అక్రమాలు ఎప్పటి వరకైతే ఆగవో.. అప్పటివరకూ దేశం పరిస్థితి మారబోదని చెప్పారు. శ్వేతజాతీయులు.. రెడ్ ఇండియన్స్.. నీగ్రోస్ ఇలా అమెరికాలోనూ ఘోరమైన జాత్యహంకార ఉద్యమం సాగిందని, అయితే అమెరికా చైతన్యవంతమైందని తెలిపారు. బరాక్ ఒబామాను అధ్యక్షుడిని చేసి, తన పాపాన్ని కడిగేసుకొన్నదని అన్నారు. దళితుల్లో అలాంటి చైతన్యం రావాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలు ఇంకా ఎంతకాలం తమ హక్కుల సాధన కోసం పోరాటం చేయాలని ప్రశ్నించారు. సమాజంలో దళితులు పీడితులు.. వంచితులుగా ఉన్నంత కాలం మనం కంటినిండా నిద్రపోలేమని అన్నారు.
Cm3
రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రజలు ఉపాధి లభించక ఇతర ప్రాంతాలకు వలస వెళ్తే.. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత 14 రాష్ర్టాల నుంచి ప్రజలు తెలంగాణకు ఉపాధి కోసం వస్తున్నారు. మహారాష్ట్ర కూడా తెలంగాణ తరహాలో అభివృద్ధి సాధించాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యం.
– సీఎం కేసీఆర్
తెలంగాణలో సంతోషంగా రైతులు
తెలంగాణ ఏర్పడినప్పుడు మహారాష్ట్రకన్నా దయనీయ పరిస్థితులు ఉండేవని సీఎం కేసీఆర్ తెలిపారు. అప్పులతో తెలంగాణ రైతులు ఆత్మహత్యలకు పాల్పడేవారని గుర్తుచేశారు, ‘రెండు మూడు ఏండ్లు ఓపిక పట్టండి.. కరెంట్ సమస్యను పరిష్కరిస్తాను’ అని చెప్పి రైతులకు ధైర్యమిచ్చామని తెలిపారు. రైతులను నిలబెట్టాలన్న లక్ష్యంతో పనిచేశామని చెప్పారు. రైతులకు ఉచితంగా 24 గంటల నాణ్యమైన కరెంట్‌ను అందిస్తున్నామని తెలిపారు. నాలుగు అంశాల్లో శ్రద్ధ తీసుకోవడం వల్ల రైతు ఆత్మహత్యలు లేకుండా చేశామని చెప్పారు. రైతులు ఇవాళ సంతోషంగా ఉన్నారని తెలిపారు.
తలాటీ వ్యవస్థ రద్దు కావాల్నా?
రైతులకు న్యాయం చేసేందుకు తెలంగాణలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేశామని, ఫలితంగా రైతులు, ఇతర వర్గాలకు ఉపశమనం కలిగిందని చెప్పారు. ఇక్కడ కూడా తలాటీ (వీఆర్వో) వ్యవస్థ రద్దు కావాల్నా? అని ప్రశ్నించగా, ‘రద్దుచేయాలి… రద్దుచేయాలి’ అంటూ ఆడిటోరియం మొత్తం మార్మోగింది. తెలంగాణలో భూ రికార్డులన్నింటినీ డిజిటలైజ్ చేశామని వివరించారు. రైతులు తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందని చెప్పారు. రైతు బంధు సొమ్మును హైదరాబాద్‌లో వేస్తే మారుమూల పల్లెల్లో ఉన్న రైతుల మొబైల్ ఫోన్లకు సమాచారం వస్తుందని చెప్పారు. భూములు డిజిటలైజ్ కావడంతో రైతుబీమా సొమ్ము నేరుగా రైతు కుటుంబాలకే చేరుతుందని, పంట కొనుగోళ్ల విషయంలోనూ పేచీ లేకుండా పోయిందని వివరించారు. డిజిటలైజేషన్ వల్ల 5 నుంచి 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తయ్యి, పట్టాదారు పాసుబుక్కే చేతికి వస్తుందని తెలిపారు. తాము తీసుకొన్న చర్యల వల్ల తెలంగాణ.. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ను దాటిపోయిందని తెలిపారు. దేశవ్యాప్తంగా 94 లక్షల ఎకరాల వరి పంట పండితే.. అందులో ఒక్క తెలంగాణలోనే 56 లక్షల ఎకరాలు పండుతున్నదని చెప్పారు.
ఇప్పటివరకు ఎన్ని ఫ్రంట్లు చూశాం. వాటివల్ల ఏమైనా మార్పు వచ్చిందా? మా (బీఆర్ఎస్) ఎజెండా నచ్చి ఇతర రాజకీయ పక్షాలు కూడా మా వెంట రావాలని కోరుతాం. బీఆర్ఎస్ ఒక పార్టీకి మేలు చేయడానికో, ఇంకో పార్టీకి నష్టం చేయడానికో పుట్టలేదు. ప్రజలకు, దేశానికి మేలు చేయడానికి పుట్టింది.
– సీఎం కేసీఆర్
నేతలు దివాలా తీయాల్సిందే
దేశంలోనే చిన్న రాష్ట్రమైన తెలంగాణలో అద్భుతాలు సృష్టిస్తున్నప్పుడు.. మహారాష్ట్రవంటి మహాన్రాజ్కు ఎందుకు సాధ్యం కాదని నాందేడ్ సభలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ప్రశ్నించిన విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు అనుకూల విధానాలు మహారాష్ట్రలోనూ అమలు చేస్తే తాను మహారాష్ట్రకు రానని చెప్పానని అన్నారు. మహారాష్ట్రలో రైతులకు మేలు జరిగేంతవరకూ తాను వస్తూనే ఉంటానని తేల్చిచెప్పారు. తెలంగాణలో కేసీఆర్‌లా చేస్తే మహారాష్ట్ర మొత్తం దివాలా తీస్తుందని కొంతమంది గొప్ప గొప్ప మేధావులు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. నేతలు తప్పకుండా దివాలా తీయాల్సిందేనని, రైతులకు దివాళీ రావాల్సిందేనని చెప్పారు. మహారాష్ట్రలో ఉన్న సంపదకు ఆ రాష్ట్ర బడ్జెట్ రూ. 6 లక్షల కోట్లు కాకుండా.. రూ. 10 లక్షల కోట్లకు తీసుకెళ్లడం పెద్దవిషయం కాదని చెప్పారు.
మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లోనూ పోటీ
మహారాష్ట్రలో అన్ని స్థాయిల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రైతులనే శాసనకర్తలుగా చేయాలన్నదే బీఆర్ఎస్ అభిమతమని స్పష్టంచేశారు. రైతు రాజ్యాన్ని స్థాపించాలన్నదే తమ సంకల్పమని తేల్చిచెప్పారు. కాలానికి అనుగుణంగా పంట పండించే రైతులకు చట్టాలు తేవడం రాదా?.. వారిని అడ్డుకోవద్దని సూచించారు.
దేశగతిని మార్చే అద్భుత అవకాశం మహారాష్ట్రకు దక్కిందని, ఇందుకోసం పనిచేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
అమెరికాలోనే కాదు.. ప్రపంచంలో అన్నిదేశాల ప్రభుత్వాలు వ్యవసాయానికి ఇన్పుట్స్ ఇస్తాయి. అమెరికాలో ఇంకా ఎక్కువ ఇన్పుట్స్ ఇస్తారు. ఒక్క మన భారత దేశంలోనే వ్యవసాయానికి అతి తక్కువ ఆర్థికసహాయం అందుతున్నది. దీనికితోడు రైతులనుంచే ప్రభుత్వం ఆదాయం పొందుతున్నది. అందుకే మనదేశంలో వ్యవసాయరంగం లాభదాయకంగా లేక, రైతులు బలవన్మరణాలకు పాల్పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
– సీఎం కేసీఆర్
మన పంట దేశమంతా తినాలి
దేశంలో రైతులు పండించిన పంటను చిత్తశుద్ధి ఉంటే ప్రపంచమంతా తినేలా చేయవచ్చని, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఆ పని చేసి చూపిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. నియోజకవర్గానికి రెండు, మూడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తే అదేమంత పెద్ద పనికాదని పేర్కొన్నారు. దేశంలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఎన్సీఆర్బీ చెప్పటం ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశంలో రైతు ఆత్మహత్యలను ఆపి తీరుతామని తేల్చిచెప్పారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’.. ఇది నినాదం కాదని, విధానం అని నినదించారు. ‘నారా నహీ.. నిర్ణయ్..నారా నహీ నిర్ణయ్’ అని కేసీఆర్ నినదిస్తుంటే సభికులంతా అనుసరించారు. మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సమితి అధ్యక్షుడు మాణిక్ కదం, పార్టీ సీనియర్ నేతలు శంకరన్న దోండ్గే, చరణ్ సింగ్ వాగ్మారే తదితరులు ప్రసంగించారు.
ఊరూరా బీఆర్ఎస్ ఎజెండా
మహారాష్ట్రలో గ్రామగ్రామాన బీఆర్ఎస్ ఎజెండాను ప్రజలకు వివరించాలని కేసీఆర్ గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతులు తలుచుకొంటే ఏదైనా చేస్తారని స్పష్టం చేశారు. రైతులను దళారీల చేతిలో మోసాలకు గురిచేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మహారాష్ట్రలో ఇప్పటికే 4 లక్షల కమిటీలు ఏర్పడ్డాయని, తొందరలోనే మహారాష్ట్రలో 25 నుంచి 30 లక్షల బీఆర్ఎస్ సైన్యం కవాతు చేయనున్నదని ప్రకటించారు. దేశం దయనీయ పరిస్థితుల్లో ఉన్నదని, దీన్ని మార్చాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ఇందుకోసం బీఆర్ఎస్ సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. నాగ్‌పూర్‌లో కార్యాలయాన్ని ప్రారంభించుకున్నామని, త్వరలోనే ఔరంగాబాద్, పుణె, ముంబైలోనూ ప్రారంభించుకుందామని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత, సీఎంకేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరేందుకు మహారాష్ట్రలోని ఆయా పార్టీల నేతలు క్యూకట్టారు. సురేశ్భట్ ఆడిటోరియానికి వచ్చిన సీఎం కేసీఆర్ మొదట మహారాష్ట్ర మహనీయుల చిత్రపటాలకు పూల మాల వేసి, నివాళి అర్పించారు. అనంతరం మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలు పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
దేశ జలవిధానాన్ని బంగాళాఖాతంలో కలపాలి
దేశ జలవిధానాన్ని బంగాళాఖాతంలో కలిపి, నూతన జల విధానం రూపొందించాలని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. ఇందుకోసమే భారత్ మార్పు చెందాలని తాము సంకల్పించామని తెలిపారు. విద్యుత్ విధానాన్ని మార్చాల్సిందేనని స్పష్టంచేశారు. 150 ఏండ్లపాటు దేశ అవసరాలకు సరిపడా విద్యుదుత్పత్తి చేసేందుకు వనరులు దేశంలో ఉన్నాయని చెప్పారు. వివిధ విద్యుత్ ఉత్పాదనలు.. వాటి తీరుతెన్నులను వివరించారు. కరెంట్ సక్రమంగా రాక ఎంతమంది రైతులు పాముకాటుతో, లో వోల్టేజీ సహా ఇతర సమస్యలతో బాధపడాలి? అని ఆయన నిలదీశారు.