గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు హర్షం వ్యక్తంచేశారు. రిజర్వేషన్లతోపాటు దళితబంధులాగే త్వరలో గిరిజనబంధు పథకాన్ని అమలుచేస్తామనడం విప్లవాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. వీటితో గిరిజనులు ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతారని అన్నారు. గిరిజనులు, బంజారాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని చెప్పారు. రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రాజ్యాంగపరమైన అడ్డంకులు లేకుండా చూడాలని, లేదంటే గిరిజనుల ఆగ్రహానికి గురికాక తప్పదని పలువురు నేతలు హెచ్చరించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ)/ సిటీబ్యూరో: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన సాంస్కృతిక జైత్రయాత్ర ఉత్సాహంగా సాగింది. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాపార్క్ మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు సాగిన భారీ ర్యాలీ సమైక్యతా స్ఫూర్తిని ఎలుగెత్తి చాటింది. ఆదివాసీ, లంబాడా గిరిజనుల ఆత్మగౌరవ భవనాల ప్రారంభోత్సవానికి తరలివచ్చిన ప్రజలతోపాటు మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్ స్టేడియం వరకూ నడుచుకుంటూ వెళ్లారు. అంబేదర్ను కీర్తిస్తూ నినాదాలు చేశారు. ‘జై తెలంగాణ- జై కేసీఆర్ – జై భారత్’ నినాదాలతో హోరెత్తించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సభాప్రాంగణానికి చేరుకొన్న క్షణంలో యువకులు, ఆదివాసీ, గిరిజనులు, విద్యార్థులు హర్షధ్వనాలతో స్వాగతం పలికారు. లంబాడా ఆదివాసీ భాషల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాన్ని ప్రారంభించడంతో కరతాళధ్వనులు మిన్నంటాయి. గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచనున్నట్టు ప్రకటించిన వెంటనే సభికులంతా నిల్చొని కేసీఆర్‌కు అభివాదం తెలిపారు. దళితబంధు లానే నిరుపేద గిరిజనులకు కూడా త్వరలోనే గిరిజనబంధు అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటనతో సభలోని ప్రతి ఒక్కరిలో ఆనందోత్సాహాలు నిండాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగిన సందర్భంలోనూ సభికులు ‘జై కేసీఆర్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ఉట్నూరు ఐటీడీఏలో రాజ్ గోండు గుస్సాడీ నృత్య శిక్షకుడు పద్మశ్రీ కనకరాజు, భద్రాచలం ఐటీడీఏలో మ్యుజిక్ చీఫ్ రాం చంద్రు, ఆదివాసీ గోండు వీరుడు కుమ్రం బీం మనుమడు సోనెరావును ముఖ్యమంత్రి కేసీఆర్ సత్కరించారు. ఎవరెస్ట్‌ను అధిరోహించిన మాలవత్ పూర్ణ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మాడవి కరీనా, గిరిజన గురుకులాల్లో చదివి ప్రస్తుతం ఎంబీబీఎస్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు గిరిజ, తరుణ్, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ చేస్తున్న విశ్వనాథ్, హర్షద్, అంకూస్, భానుప్రకాశ్‌ను శాలువాలతో సన్మానించారు.
ఈ రోజు గిరిజన జీవితాల్లో చారిత్రక ఘట్టం. 75 ఏండ్లుగా గిరిజన బిడ్డల కల సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాకారమైంది. బంజారాహిల్స్‌లో రూ.44 కోట్లతో గిరిజన ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిర్మించిన సౌధాలను సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభించుకోవడం మరిచిపోలేని రోజు. గిరిజన పండగులన్నీ ఈ రోజు వచ్చినట్టు ఉన్నాయి. అన్ని వర్గాలతో సమానంగా ఆదివాసీ, గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం సమాన అవకాశాలను కల్పిస్తున్నది. తండాలను, గూడేలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి స్వయంపాలన అధికారం కట్టబెట్టింది. ఆదివాసీలు, గిరిజనులు ఎప్పుడూ ముఖ్యమంత్రి వెన్నంటి నడుస్తారు. ఆదివాసీ, గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్
స్వరాష్ట్రంలో ఆదివాసీ, బంజారాలకు సమ న్యాయం దక్కుతున్నది. సీఎం కేసీఆర్ పాలనలో కుమ్రంభీం, సంత్ సేవాలాల్ ఆశయాలు నెరవేరుతున్నాయి. మిషన్‌భగీరథ పథకం ద్వారా మారుమూల గూడేలకు శుద్ధి చేసిన తాగు నీరు అందుతున్నది. పోడు భూముల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నది. కుమ్రం భీం ఆశయాలపై జల్, జంగల్, జమీన్ కలలు సీఎం కేసీఆర్ నేతృత్వంలో నేడు నెరవేరుతున్నాయి.
– ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
గిరిజనులకు 10% రిజర్వేషన్లు కల్పించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం వీటిని అమోదించడంతోపాటు బోయలను ఎస్టీల్లో చేర్చాలి. ఈ రెండింటిపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసి పంపించింది.
– నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
రాష్ట్రంలోని గిరిజనులకు 10% రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయం. దళిత బంధులాగే త్వరలో గిరిజనబంధు పథకాన్ని అమలుచేస్తామనడం విప్లవాత్మక నిర్ణయం. వీటితో గిరిజనులు ఆర్థికంగా, సామాజికంగా అగ్రపథంలో నిలుస్తారు.
– సబితాఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి
గిరిజనులు, బంజారాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నది. గతంలో నేను ఐటీడీఏ పీవో, మంత్రిత్వ శాఖ సెక్రటరీగా పనిచేశాను. గిరిజనులు, ఆదివాసీలతో నాకు విడదీయలేని అనుబంధం ఉన్నది. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం 2017 నుంచి ఎస్టీ సబ్‌ప్లాన్ స్పెషల్ ఫండ్‌ను అమలు చేస్తున్నది. గిరిజన గురుకుల విద్యార్థులు అద్భుత విజయాలను సాధిస్తున్నారు. 918 మంది జాతీయస్థాయి సంస్థల్లో అడ్మిషన్లు పొందారు. ఆత్మీయ సభను నిర్వహణకు అవకాశమిచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.
– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్
సీఎం కేసీఆర్ తాను గిరిజన పక్షపాతినని మరోసారి నిరూపించుకున్నారు. రిజర్వేషన్లపై కేంద్రం తక్షణమే స్పందించి రాజ్యాంగపరమైన అడ్డంకుల్లేకుండా చూడాలి. లేదంటే గిరిజనుల ఆగ్రహానికి గురికాక తప్పదు. గిరిజనబంధు విప్లవాత్మకం.
– చంద్రావతి, మాజీ ఎమ్మెల్యే
ఈరోజు తెలంగాణ గిరిజనులకు నవోదయం. 10% రిజర్వేషన్లతో గిరిజన విద్యార్థులకు ఇంజినీరింగ్, మెడిసిన్, న్యాయవాద, వృత్తివిద్యాకోర్సుల్లో మరిన్ని అవకాశాలు దక్కుతాయి. టీఎస్పీఎస్సీ, ఇతర రిక్రూటింగ్ ఏజెన్సీలు భర్తీచేస్తున్న ఉద్యోగాల్లోనూ వాటా దక్కుతుంది. మేమంతా గిరిజన బంధువు కేసీఆర్ వెన్నంటే ఉంటాం.
– హన్మంత్‌నాయక్, గ్లోబల్ బంజారా వెల్ఫేర్ సొసైటీ సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు
గిరిజనులకు 10% రిజర్వేషన్లు కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. కేంద్రం కూడా రాజ్యాంగపరమైన చిక్కులు లేకుండా రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవాలి. గిరిజనబంధు అమలు చేస్తామనడం సంతోషకరం. గిరిజనులు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారు.
– రమావత్ అంజయ్యనాయక్, తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సీఎం కేసీఆర్ గిరిజన ఆదివాసీ ఆరాధ్యదైవాలు సంత్‌సేవాలాల్ మహరాజ్, కుమ్రంభీం మాదిరిగా గిరిజనుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. గిరిజనులకు దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో గుర్తింపు దక్కలేదు. ఇంతటి మహోన్నత గౌరవాన్ని ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– రూప్సింగ్, గిరిజన నేత, టీఆర్ఎస్ కార్యదర్శి
గిరిజనులను అన్ని ప్రభుత్వాలు ఓటుబ్యాంకుగానే చూశాయి. సీఎం కేసీఆర్ మాత్రం గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. తప్పకుండా ఆ గొప్ప నాయకుడి రుణం తీర్చుకుంటాం.
– ఇస్లావత్ రామచంద్రనాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు
గిరిజనులకు 10% రిజర్వేషన్లు కల్పించడం హర్షణీయం. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి ఆలోచనలు చేయలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు. గిరిజన ఆత్మగౌరవ భవనంలో వంజరులకు ప్రాధాన్యం ఇవ్వాలి.
– అఖిల భారత వంజరి సేవాసంఘ్ నేతలు సాల్వేరు కృష్ణ, ఎదుగాని శంకర్ నారాయణ, కాలేరు సురేశ్, కాలేరు నర్సింగ్‌రావు,పిట్టల అంజయ్య, లక్ష్మీకాంత్ ముస్లే