హైదరాబాద్, జులై 9 (నమస్తే తెలంగాణ): దేశంలో తొలిసారిగా 100% గ్రీన్ గవర్నమెంట్ భవనాన్ని నిర్మిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర రెడ్కో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన నూతన సచివాలయ సముదాయం సమీపంలో నిర్మిస్తున్న గ్రీన్ గవర్నమెంట్ బిల్డింగ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రెన్యువబుల్ ఎనర్జీకి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. పర్యావరణానికి హాని కలగకుండా ప్రకృతి ప్రసాదించే ఎండ, గాలితో తయారయ్యే విద్యుత్తు ఉత్పత్తిపై ఫోకస్ పెట్టినట్టు చెప్పారు. అందులో భాగంగానే అధునాతన టెక్నాలజీ, పవన, సౌర విద్యుత్తు వ్యవస్థలతో గ్రీన్ బిల్డింగ్‌ను నిర్మిస్తున్నట్టు వివరించారు.