పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి రోడ్డుమార్గాన వెళ్తున్న సీఎం కేసీఆర్‌కు రంగారెడ్డి జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు, రైతులు రోడ్డుకిరువైపులా నిల్చొని జలదాతకు జైకొట్టారు. ఆ రోడ్డు మార్గం మొత్తం జెండాలు.. ఫ్లెక్సీలు.. బ్యానర్లు.. ఇలా ఎటు చూసినా గులాబీమయం కాగా, పటాకుల మోతతో మార్మోగింది. కందుకూరు వద్ద పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు చేరి ముఖ్యమంత్రికి హర్షధ్వానాలు పలికారు. రహదారి పొడవునా పూలు జల్లుతూ, గులాబీ కాగితాలు వెదజల్లుతూ నీరాజనం పలికారు. ఆమన్‌గల్ మీదుగా సాగిన కాన్వాయ్ కల్వకుర్తి మీదుగా నాగర్ కర్నూల్ వైపుగా ముందుకు సాగగా.. అధినేతకు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సులో నుంచే ప్రజలకు అభివాదం చేస్తూ ఉత్సాహంతో ముందుకుసాగారు.
హైదరాబాద్/రంగారెడ్డి, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల మది నది అయింది. పాలవెల్లిలా పరవశించిపోయింది. అపర భగీరథుడు సీఎం కేసీఆర్ సంకల్పంతో కృష్ణమ్మ బిరాబిరా ఎగిరి దుంకగా.. ఆ జలధార కోసం దశాబ్దాలుగా ఎదురుచూసిన హృదయాలు ఉప్పొంగాయి. నదికి సరికొత్త నడకనేర్పిన జలదాత సీఎం కేసీఆర్‌కు జనహారతి పట్టింది. శనివారం ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో నెలకొన్న దృశ్యాలు.. అనంతాకాశంలో తారాజువ్వలా మిరిమిట్లు గొలిపాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ నార్లాపూర్ పంప్‌హౌస్ వద్ద ప్రారంభించేందుకు ప్రగతిభవన్ నుంచి పయనం కాగా, ముందుగా ప్రగతిభవన్‌లో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ కేసీఆర్‌కు దట్టీకట్టారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్, పట్నం మహేందర్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, ఎంపీలు పోతుగంటి రాములు, జీ రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్, మన్నెం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ, కేపీ వివేకానంద సహా ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, హైదరాబాద్‌కు చెందిన ప్రజాప్రతినిధులను తోడ్కొని సీఎం కేసీఆర్ బస్సు నార్లాపూర్‌కు పయనమయింది.
సీఎం కాన్వాయ్ బయలుదేరింది అన్న సమాచారం తెలుసుకొన్న ఆ రెండు జిల్లాల స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలు, మేధావులు, విద్యావంతులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హైదరాబాద్ నుంచి నార్లాపూర్ దాకా ఎక్కడికక్కడ రోడ్డుకిరువైపులా నిల్చొని ఘనస్వాగతం పలికారు. ఈ రెండు జిల్లాల ప్రజాప్రతినిధులతోపాటు దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల నుంచి స్థానిక నాయకులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవ చరిత్రాత్మక ఘట్టంలో తామూ భాగస్వామ్యం కావాలని పోటీపడ్డారు. పదుల సం ఖ్యలో బయలుదేరిన సీఎం కాన్వాయ్‌లోని కార్ల సంఖ్య నార్లాపూర్ వెళ్లేసరికి వందలయ్యా యి. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గాన తుక్కుగూడ వద్ద శ్రీశైలం-హైదరాబాద్ జాతీ య రహదారిపై నుంచి రంగారెడ్డి జిల్లా కందుకూరు, కడ్తాల్, ఆమనగల్లు, కల్వకుర్తి మీదుగా నాగర్‌కర్నూల్, నార్లాపూర్ వరకు సీఎం కేసీఆర్ పయనం సాగింది. సీఎం కేసీఆర్ కాన్వా య్ ఓర్ఆర్ఆర్ మీదుగా నార్లాపూర్ వెళ్తున్నప్పుడు స్థానికులు తీసిన డ్రోన్ దృశ్యాలు అబ్బురపరిచాయి. సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. హైదరాబాద్ మహానగరం నుంచి నార్లాపూర్ వెళ్లే దారిలో సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లోని కార్లు నదిపారినట్టు సవ్వడి చేశాయి.
అడుగడుగునా నీరా‘జనం’
హైదరాబాద్ నుంచి నార్లాపూర్ అటు నుంచి కొల్లాపూర్ దాకా సీఎం కేసీఆర్‌కు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. దారిపొడవునా రోడ్డుకిరువైపులా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు సీఎం కేసీఆర్‌ను చూడగానే చప్పట్లు.. ఈలలతో కేరింతలు కొట్టారు. గులాబీ శ్రేణులు పూలవర్షం కురిపించాయి. పార్టీ కార్యకర్తలు, రైతులు పటాకులు పేల్చి హర్షం వ్యక్తం చేశారు. బతుకమ్మ పండుగోలె మహిళలు ‘కొత్తబట్టలతోటి కోటిముచ్చట్లు’ అన్నట్టు బతుకమ్మలు చేబూని అపూర్వస్వాగతం పలికారు. దసరా పండుగనాడు పాలపిట్టను చూసి సంబురపడ్డట్టు సీఎం కేసీఆర్‌ను చూసి ‘జై కేసీఆర్’ అంటూ ప్రజలు నినదించారు.
తొవ్వలన్నీ గులాబీ పువ్వులై
హైదరాబాద్ ప్రగతిభవన్ నుంచి నార్లాపూర్ దాకా పట్టణాలు, గ్రామాలు, గ్రామ కూడళ్లు అన్నీ గులాబీమయమయ్యాయి. ఎక్కడచూసినా గులాబీ జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లతో దారులన్నీ పూలతేరులై పులకించిపోయాయి. దశాబ్దాల తమ కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్‌కు పాలమూరు, రంగారెడ్డి జనం గుండెలు ఉప్పొంగేలా జయజయ ధ్వానాలు చేశారు. ‘జై తెలంగాణ’, ‘జై కేసీఆర్’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. సీఎం కేసీఆర్ కాన్వాయ్ వెళ్లే మార్గంలోని అన్ని నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గాల్లోని అన్ని ప్రాంతాల్లోని గులాబీ శ్రేణులు సీఎం కేసీఆర్‌కు అపూర్వస్వాగతం పలికేందుకు పోటీపడ్డాయి. పటాకుల మోతలతో దారులన్నీ దీపావళిని తలపించాయి. మొత్తంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవం నార్లాపూర్లోనే కాదు తమ పల్లెలో.. తమవాడలో అన్నట్టు సబ్బండవర్గాల ప్రజలు తమకు కృష్ణమ్మను రప్పించిన జలదాత కేసీఆర్‌కు పబ్బతిపట్టారు. తెలంగాణ చరిత్రలో శనివారం కృష్ణమ్మశోభితమయ సువర్ణాక్షర ఝరి కురిపించిన పర్వదినమని జనం పరవశించిపోయింది.