బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 01:18:48

అప్రమత్తంగా ఉండాలి

అప్రమత్తంగా ఉండాలి

  • అధికారులు, ప్రజలకు సీఎం కేసీఆర్‌ సూచన
  • భారీవర్షాల నేపథ్యంలో యంత్రాంగం అలర్ట్‌
  • జిల్లా అధికారులతో మాట్లాడిన సీఎస్‌ సోమేశ్‌
  • ఆదివారం పలు జిల్లాల్లో దంచి కొట్టిన వానలు
  • పలుచోట్ల పంటపొలాల్లోకి చేరిన వరద నీరు

వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచించారు. రాష్ట్రంలో ఆదివారం అనేకచోట్ల వర్షం కురిసింది. సోమ, మంగళవారాల్లోనూ భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించినందున అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను  ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్‌ సూచించారు.

 ప్రధానంగా భారీవర్ష సూచన ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల అధికారులు మరింత అప్రమత్తం కావాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు సిద్ధంగా ఉంచాలని, వంతెనలపైనుంచి వరదనీరు ప్రవహించే ప్రమాదం ఉన్నందున ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా దృష్టిపెట్టాలని పేర్కొన్నారు. ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికార యంత్రాంగం ఫ్లడ్‌ ప్రొటోకాల్‌ను అనుసరిస్తూ, ఎక్కడివారక్కడే ఉంటూ పరిస్థితిని బట్టి చర్యలు తీసుకోవాలని సీఎస్‌ ఆదేశించారు. వరద పరిస్థితితోపాటు, ప్రమాదాలపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని సూచించారు. 


logo