Pattana Pragathi | హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ‘పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణ ప్రజల మెరుగైన జీవన విధానానికి సీఎం కేసీఆర్ బలమైన పునాదులు వేశారు. పట్టణ ప్రగతితో పట్టణాలు పరిశుభ్రంగా మారాయి. పచ్చదనం కమ్ముకున్నది. పౌరులకు మెరుగైన పాలన అందించే దిశగా అడుగులు పడ్డాయి’ అని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం పట్టణ ప్రగతి దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి పట్టణ ప్రగతి నివేదిక-2023ను విడుదల చేశారు. ఆ నివేదికలోని ముఖ్యాంశాలివే..
రాష్ట్ర జనాభాలో 47% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దేశంలో అత్యంత వేగంగా పట్టణీకరణ చెందిన రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. రాష్ట్రంలోని మొత్తం భూభాగంలో పట్టణ ప్రాంతాలు 6 శాతం ఉన్నాయి. ఈ పట్టణ ప్రాంతాలు జీఎస్డీపీ వృద్ధికి 65 నుంచి 70% దోహదం చేస్తున్నాయి. పట్టణీకరణలో తమిళనాడు, కేరళ తర్వాతి స్థానం లో తెలంగాణ ఉన్నది.
తెలంగాణ ఏర్పడ్డాక 15వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న దాదాపు అన్ని గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. దీంతో 74 కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటయ్యాయి. అర్బన్ లోకల్ బాడీలు 68 నుంచి 142కి చేరాయి. మున్సిపాలిటీల సంఖ్య 62 నుంచి 129కి, మున్సిపల్ కార్పొరేషన్లు 6 నుంచి 13కి పెరిగాయి. మొత్తం వార్డుల సంఖ్య 3,618కి పెరిగింది.
అభివృద్ధి చెందుతున్న పట్టణాలను సమస్యల సుడిగుండం నుంచి తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2019లో తెలంగాణ మున్సిపాలిటీ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనివల్ల నిధులు ఖర్చు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నది. పౌరులు మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరగకుండానే ఎన్నో పనులు ఫోన్లలోనే పూర్తయ్యేలా వెసులుబాటు కలిగింది. మెరుగైన, వేగవంతమైన, జవాబుదారీతనం, పారదర్శక పాలన కోసం ఈ-గవర్నెన్స్ వ్యవస్థను ప్రభుత్వం మరింత పటిష్టంగా తయారు చేసింది.
రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ప్రభుత్వం వైకుంఠ ధామాలను ఏర్పాటు చేసింది. ఇందుకు రూ.200 కోట్లు కేటాయించింది.
బాడీలకు 490 వైకుంఠధామాలు మంజూరుకాగా, వాటిల్లో 335 పూర్తయ్యాయి. ఇంకా 148
నిర్మాణంలో ఉన్నాయి.
పట్టణ ప్రజలకు మెరుగైన ఆహార పదార్థాలను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్లను నిర్మించింది. దీంతో కూరగాయలు, పండ్లు ఫలాలు, నాన్‌వెజ్ ఐటెమ్స్ అన్నీ ఒకేచోట దొరుకుతున్నాయి. వీటి నిర్మాణం కోసం రూ.500 కోట్లు రాష్ట్రబడ్జెట్లో, రూ.360 కోట్లు మున్సిపల్, ఇతర నిధుల నుంచి తీసుకున్నది. 142 అర్బన్ బాడీలకు 151 ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్లు మంజూరుకాగా,137 పూర్తయ్యాయి.
పట్టణ ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు అందుతున్నది. 141 అర్బన్ లోకల్ బాడీలకు నీళ్లు అందించేందుకు ప్రభుత్వం రూ.4,392.27 కోట్లను ఖర్చు చేసింది. మున్సిపాలీటీల్లో ఒక కుటుంబానికి సగటున 135 లీటర్లు సరఫరా చేస్తుండగా, మున్సిపల్ కార్పొరేషన్లలో 150 లీటర్లు సరఫరా చేస్తున్నది.
హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ విద్యుత్తు ప్లాంట్ నుంచి 24 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి జరుగుతున్నది. డిసెంబర్ 2024 నాటికి దుండిగల్, యాచారం, భువనగిరి, ప్యారానగర్ విద్యుత్తు కేంద్రాల నుంచి కరెంటు అందుబాటులోకి రానున్నది.
టీఎస్‌బీపాస్‌తో సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చుకుంటే భవన నిర్మాణానికి ఆన్లైన్లోనే అనుమతులు వచ్చేస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో 2020లో ప్రవేశపెట్టారు. ఈ విధానంలో ఇప్పటివరకు 2,45,000 దరఖాస్తులు ప్రాసెస్ అయ్యాయి.
జీహెచ్ఎంసీతో సహా 142 అర్బన్ లోకల్ బాడీల్లో 1,612 అర్బన్ నర్సరీలు ఏర్పాటయ్యాయి. మొత్తం 20,986 కిలోమీటర్ల మేర ప్లాంటేషన్ జరిగింది. బహిరంగ ప్రదేశాల్లో పచ్చదనాన్ని పెంచడానికి, ఆక్రమణలను నివారించడానికి మొత్తం 3,224 పట్టణ ప్రకృతి వనాలు/ట్రీ పారులు అభివృద్ధి అయ్యాయి. ఇందుకు మూడేండ్లలో కేటాయించిన గ్రీన్ బడ్జెట్ రూ.1,523 కోట్లు.
అధునాతన రోడ్లు.. అందమైన లైట్లు తెలంగాణ ప్రభుత్వం కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అధునాతన రోడ్లను నిర్మించింది. వాటిలో ప్రత్యేకంగా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ను రూపొందించింది. ఈఈఎస్‌ఎస్ ద్వారా 14,01,159 కొత్త ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసింది.
బస్తీ ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 484 బస్తీ దవాఖానాలను మంజూరు చేసింది. 398 బస్తీ దవాఖానాలు పూర్తవ్వగా, వైద్యసేవలు అందుతున్నాయి.
రాష్ట్రంలో 4,713 పారిశుధ్య వాహనాలు ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరిస్తున్నాయి. పారిశుధ్య కార్మికుల సంఖ్య 14,249 నుంచి 22,533కి పెరిగింది. డంపింగ్ యార్డుల సంఖ్య 32 నుంచి 141కి చేరింది. 226 వర్మీ కంపోస్టింగ్/విండో కంపోస్టింగ్ ద్వారా చెత్త ప్రాసెస్ నడుస్తున్నది. గ్రేటర్ మున్సిపాలిటీతోపాటు సిద్దిపేటలో బయో మిథనేషన్ ప్లాంట్లు కొనసాగుతున్నాయి. సూర్యాపేట, సిద్దిపేటలో ప్లాస్టిక్ వ్యర్థాలను టైల్స్, ఇటుకలుగా మార్చే ప్రక్రియను చేపట్టారు. సిద్దిపేటలో స్వచ్ఛబడి పేరుతో కంపోస్టింగ్‌పై అవగాహన కల్పిస్తున్నారు.
పట్టణాల్లో ప్రతి వెయ్యిమంది జనాభాకు ఒక పబ్లిక్ టాయిలెట్ నిర్మాణం చేపట్టారు. పబ్లిక్ టాయిలెట్లను 14,468కి పెంచారు. ప్రత్యేకంగా మహిళల కోసం 54 షీ టాయిలెట్స్, 32 మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు.
2021లో సఫాయి మిత్ర సురక్ష చాలెంజ్ కింద రెండో ఉత్తమ అవార్డు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు దక్కింది. స్వచ్ఛ సర్వేక్షణ్ కింద 2021లో తెలంగాణకు చెందిన 10 అర్బన్ లోకల్ బాడీస్‌కు అవార్డులు వచ్చాయి. స్వచ్ఛ సర్వేక్షణ్-2022లో 26 అవార్డులు దక్కాయి. క్లీనెస్ట్ సిటీస్ క్యాటగిరీ కింద కొత్తపల్లి, ఘట్కేసర్, గజ్వేల్, బడంగ్‌పేటకు అవార్డులు వచ్చాయి. ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ సిటీస్ క్యాటగిరీలో చిట్యాల, సస్టెయినబుల్ సిటీ క్యాటగిరీలో భూత్కూర్, ఆదిబట్ల, సిరిసిల్ల, ఫాస్టెస్ట్ మూవింగ్ సిటీ క్యాటగిరీలో చండూర్, వర్ధన్నపేట, కొంపల్లి, గుండ్ల పోచంపల్లి, కొత్తకోట, తుర్కయాంజాల్, ఆమనగల్, కాగజ్‌నగర్, జనగామ, జీహెచ్ఎంసీ, సిటిజన్ ఫీడ్బాక్ క్యాటగిరీలో నేరేడుచర్ల, హుస్నాబాద్, వేములవాడ, కంటోన్మెంట్ బోర్డు క్యాటగిరీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఇండియన్ స్వచ్ఛత లీగ్ క్యాటగిరీలో అలంపూర్, పీర్జాదిగూడ, కోరుట్లకు అవార్డులు దక్కాయి.