హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): సంపద సృష్టించి ప్రజలకు పంచుతూ దేశాన్ని గుణాత్మక అభివృద్ధి దిశగా నడిపించేందుకు వినూత్నరీతిలో పాలన కొనసాగించాల్సిన అవసరమున్నదని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కే చంద్రశేఖర్‌రావు అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత కూడా కేంద్ర పాలకులు అదే మూస ధోరణిని అనుసరిస్తున్నారని విమర్శించారు. అపార సహజ వనరులను వినియోగించుకోవడం ఎటూ చేతగాని కేంద్ర పాలకులు.. మహిళలు, రైతులు, యువత, వృత్తి కులాల వంటి సంపద సృష్టించే మానవ వనరులను కూడా సరైన పంథాలో వినియోగించుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దార్శనికత లేకపోవడంవల్లే దేశంలో జరగాల్సినంత అభివృద్ధి జరగడంలేదని అన్నారు. మహారాష్ట్రలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులు గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ముంబైసహా పలు ప్రాంతాల నుంచి వచ్చినవారికి సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అన్ని రంగాల్లో పూర్తిస్థాయిలో భారత దేశాన్ని తీర్చిదిద్దే మహోన్నత లక్ష్యంతో ఏర్పాటైన ‘భారతదేశ పరివర్తన మిషన్’ అని స్పష్టం చేశారు. వివక్ష లేని వికాసమే బీఆర్ఎస్ లక్ష్యమని పేర్కొన్నారు. దేశంలో ఇప్పటికీ అభివృద్ధి నిరోధకులకే ఓట్లేసి గెలిపిస్తూ వస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.
సమాజంలో సగభాగం ఉన్న మహిళా శక్తిని వం టింటికే పరిమితం చేస్తూ, ఉత్పాదక రంగంలో, సంపద సృష్టిలో వారిని భాగస్వాములను చేయక పోవడంవల్ల దేశం నష్టపోతున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. మహిళలు, యువతను సక్రమంగా వినియోగించుకోవాల్సి ఉన్నదని చెప్పారు. ఇలాంటి వి వక్షకు స్వస్తి పలకాలని, ప్రపంచంతో పోటీ పడుతూ దేశం అభివృద్ధి పథంలో పయనించాలంటే ఈ దిశ గా సమూల మార్పు జరగాల్సిందేనని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ పార్టీతోనే అన్ని రంగాల్లో గుణాత్మకంగా దేశాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
పుణె జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఎల్టీ సావంత్, దక్షిణ ముంబై ఎన్సీపీ అధ్యక్షుడు మానవ్ వెంకటేశ్, మాజీ సీబీఐ అధికారి లక్ష్మణరాజ్ సనప్, ప్రముఖ క్రీడాకారుడు నీలేశ్ మధుకర్ రాణే, జడ్పీ మెంబర్ భగవాన్ సనప్, నాగ్‌పూర్ ఎన్సీపీ ఉపాధ్యక్షుడు, సామాజిక సేవకుడు డాక్టర్ కిరణ్ వైద్య, ఉత్తమ్‌రావు వాగ్, మహారాష్ట్ర ఎంబీటీ అధ్యక్షుడు అజర్ అహ్మద్, ఘనశ్యామ్ బాపూ హకే, పహిల్వాన్ అప్పాసాహెబ్ అరేన, సంతోష్ బిచుక్లే, ప్రకాశ్ సాహురావు బోసలె, పలువురు మాజీ సైన్యాధికారులతోపా టు ముంబై, బాంద్రా, ధారావి తదితర ప్రాంతాల నుంచి మహిళా నేతలు, మాజీ ఉన్నతాధికారులు, లాయర్లు, డాక్టర్లు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, ఎంపీ బీబీ పాటిల్, కార్పొరేషన్ చైర్మన్ సముద్రాల వేణుగోపాలచారి, మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు శంకరన్న దోండ్గే, మాణిక్ కదమ్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో రోజురోజుకూ వృద్ధి చెందుతున్నదని ఆ రాష్ట్ర బీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్‌కు తెలిపారు. ఇటీవలి పండరిపూర్ పర్యటన తర్వాత అన్ని పార్టీల ముఖ్యనేతలు స్పందించడం చూస్తుంటే వారికి బీఆర్ఎస్ ఎదుగుదలను చూసి భయం పట్టుకున్నదని అర్థమవుతున్నదని చెప్పారు. మహారాష్ట్రలో ఎకడ చూసి నా బీఆర్ఎస్ గురించిన చర్చనే నడుస్తున్నదని అన్నారు. రైతులతోపాటు, వృత్తి కులాలు, పేదలుసహా వర్గాలు పార్టీని విపరీతంగా ఆదరిస్తురని పేర్కొన్నారు. పల్లె పల్లెనా బీఆర్ఎస్ సభ్యత్వాలు జోరుగా సాగుతున్నాయని వివరించారు.