సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 02:40:44

నేడు క్యాబినెట్‌ భేటీ

నేడు క్యాబినెట్‌ భేటీ

  • పలు అంశాలపై నిర్ణయాలు తీసుకొనే అవకాశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు జరుగనున్నది. ప్రగతిభవన్‌లో జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశమున్నది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన పలు కార్యక్రమాలపై మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలిపే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.  

మంత్రులు, పార్టీ నేతలతో సీఎం సమీక్ష 

రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం మంత్రులు, టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన ధరణి పోర్టల్‌పై సీఎం ఆరా తీసినట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, పార్టీ శ్రేణులు  కార్యదీక్షతో ముందుకు సాగాలని  పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.  భూ వివాదాలకు  శాశ్వత పరిష్కారం చూపే  ధరణి పోర్టల్‌కు రాష్ట్ర వ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తున్నదని, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ భూ తగాదాలు పుట్టించి పబ్బం గడిపే కొందరి ఆటలకు ధరణి చరమగీతం పాడినట్టు అయిందని.. మంత్రులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ప్రభుత్వ కార్యక్రమాలను నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపైనే ఉన్నదని, ఇందుకోసం కిందిస్థాయిలో పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని  సీఎం కేసీఆర్‌ సూచించినట్టు సమాచారం.