రైతుల్ని చూసి ప్రాణభయంతో పారిపోతున్న వాళ్లదా?
రైతుల మధ్యే బతుకుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌దా?
మధ్యప్రదేశ్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్ల్లో కాంగ్రెస్ గెలిచినవి 114 సీట్లు, బీజేపీకి వచ్చినవి 109.. అప్పటికి మూడుసార్లు సీఎంగా ఉన్న శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను ఆ రాష్ట్రప్రజలు ‘ఇక నువ్వు ఇంటికిపో..’ అని ఓటుతో సాగనంపారు. అయినా సిగ్గులేకుండా ఏడాదిన్నర తిరక్కుండానే ప్రజాస్వామ్యాన్ని చెరపట్టి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ప్రజల తీర్పుకు వెన్నుపోటు పొడిచి అక్రమంగా, అనైతికంగా, రాజ్యాంగ విరుద్ధంగా సీఎం గద్దెనెక్కారు.
ద్వారపయుగంలో కంసుడు అధికారదాహంతో తన తండ్రి ఉగ్రసేనుడిని ఖైదుచేసి రాజ్యాన్ని ఆక్రమించుకొన్నాడు.
ఆధునిక రాజకీయాల్లో నేతలందరికీ ప్రజాస్వామ్యమే తండ్రి, తల్లి. అధికారం కోసం అలాంటి ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి, ఫిరాయింపులతో వెన్నుపోటు పొడిచి, ప్రజాభీష్ఠానికి విరుద్ధంగా అధికారంలోకి వచ్చిన చౌహాన్ కంసుడు కాదా?
జన మనోభీష్ఠాన్ని మన్నించి 14 ఏండ్లు ఉద్యమం నడిపి, రాష్ర్టాన్ని సాధించి మొదటిసారి 63 సీట్లు, రెండోసారి 89 సీట్లలో సంపూర్ణ విజయం సాధించి రాచమార్గంలో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కంసుడు అవుతాడా? చౌహాన్ కంసుడు కనుకనే ఆయనకు మధ్యప్రదేశ్ ప్రజలు ‘(కంస)మామా’అని పేరుపెట్టారేమో!
హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): సొంత రాష్ర్టాల్లో ప్రజలు ఛీ కొట్టిన బీజేపీ నేతలు తెలంగాణకొచ్చి అవాకులు, చవాకులు పేలుతున్నారు. పూటకో నేత వచ్చి, రోజుకో మీటింగ్ పెట్టి పదిమందికూడా లేని సమావేశాల్లో ఆవేశంతో ఊగిపోతున్నారు. నాలుగురోజుల క్రితం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, మొన్న ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్‌సింగ్, నిన్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్.. వీరందరికీ తెలంగాణలో ఏం పని? ఇప్పుడు రాష్ట్రంలో ఏమైనా ఎన్నికలున్నాయా? మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శుక్రవారం హైదరాబాద్ వచ్చి సీఎం కేసీఆర్‌పై అవాకులు చవాకులు పేలారు. ‘కేసీఆర్ రెండుసార్లే సీఎం అయ్యారు.. నేను నాలుసార్లు సీఎం’ అని బడాయి పోయారు. ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్తారా చౌహాన్? ఇప్పుడు తెలంగాణ జీఎస్డీపీ ఎంత? మధ్యప్రదేశ్ జీఎస్డీపీ ఎంత? తెలంగాణ తలసరి ఆదాయం ఎంత? మధ్యప్రదేశ్‌ది ఎంత?కార్మికులు ఉపాధిలేక తెలంగాణ నుంచి ఇతర రాష్ర్టాలకు వలస పోతున్నారా? ఇతర రాష్ర్టాల నుంచి (మధ్యప్రదేశ్ నుంచి కూడా) తెలంగాణకు వలస వస్తున్నారా? శివరాజ్‌సింగ్ మధ్యప్రదేశ్ సీఎం అయిన దాదాపు పదేండ్ల తర్వాత ఏర్పడిన తెలంగాణ జీడీపీ 2021లో రూ.9.78 లక్షల కోట్లు.. మధ్యప్రదేశ్ జీడీపీ రూ.9.17 లక్షల కోట్లు. దేశంలో జీడీపీ ర్యాంకింగ్స్‌లో తెలంగాణది పదోస్థానం, మధ్యప్రదేశ్‌ది 11వ స్థానం. 2020-21 లెక్కల ప్రకారం తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,50,691. మధ్యప్రదేశ్ తలసరి ఆదాయం రూ.1,09,181. 2019-19తో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం పెరిగితే, మధ్యప్రదేశ్ తలసరి ఆదాయం తగ్గింది. ఈ విభాగంలో తెలంగాణ దేశం మొత్తంలో ఏడో స్థానంలో, పెద్ద రాష్ర్టాల్లో రెండోస్థానంలో ఉంటే, మధ్యప్రదేశ్ ఎక్కడో అట్టడుగున 27వ స్థానంలో ఉన్నది. మరి నాలుగుసార్లు సీఎంగా ఉండి మధ్యప్రదేశ్‌ను ఎందుకు అభివృద్ధి చేయలేదు? నేటికి నేడు కూడా తెలంగాణ పంటపొలాల్లో, రైస్ మిల్లుల్లో మధ్యప్రదేశ్ కూలీలు, హమాలీలు పనిచేస్తున్నారు. మీ రాష్ట్రంలో మీరు ఉపాధి కల్పిస్తే ఇక్కడికి ఎందుకు వస్తారు? నాలుసార్లు సీఎం అయిన చౌహాన్ గొప్పోడే అయితే తెలంగాణలో కేసీఆర్ ప్రవేశపెట్టిన లాంటి ఒక్క పథకాన్నీ మధ్యప్రదేశ్‌లో ఎందుకు తేలేదు? నిజానికి కేసీఆర్ పథకాలను చౌహాన్ గతంలో గొప్పగా పొగిడారు. వాటిని ఆదర్శంగా తీసుకొని దేశమంతా అమలుచేయాలని సూచించారు కూడా. మిషన్ కాకతీయ పథకం అద్భుతమని, దానిని పరిశీలించేందుకు వస్తానని 2015 డిసెంబర్ 13న రాష్ట్రమంత్రి హరీశ్‌రావుతో భోపాల్‌లో స్వయంగా అన్నది గుర్తులేదా? మీరు సమర్థులైన పాలకులే అయితే మధ్యప్రదేశ్ అట్ల వెనుకబడి ఎందుకున్నది? తెలంగాణ అన్నిరంగాల్లో ప్రగతిపథంలో ఎందుకు దూసుకుపోతున్నది?
రోడ్డుమీద ఫ్లైఓవర్ కింద 100 మంది రైతులను చూసి మూడు కిలోమీటర్ల ముందే ఆగిపోయిన ప్రధానికి భయమా? లేక కేసీఆర్ కా? వడ్ల విషయంలో బీజేపీ నేతలు రైతులను రెచ్చగొట్టాలని చూసిన సమయంలో కూడా సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్ పర్యటనకు వెళ్లి తిరిగి వస్తూ రైతుల వద్ద ఆగి మాట్లాడి, వారి బాగోగులు తెలుసుకొని, వడ్లు కాదు ఇతర పంటలు వేయాలని నచ్చజెప్పగలిగారు. రైతులను చూసి కాన్వాయ్‌ను యూటర్న్ తిప్పకొని ప్రాణభయంతో బతుకు జీవుడా అంటూ పారిపోయి ఊపిరి పీల్చుకొన్న మోదీకి భయమా? నిరంతరం రైతులతో సంభాషించే కేసీఆర్‌కు భయమా? భయమన్నది కేసీఆర్ చరిత్రలో ఉంటే ఉద్యమమే సాగేది కాదు. రాష్ట్రమే వచ్చేదికాదు.
తెలంగాణలో బీజేపీ ఎక్కడుంది? గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు, సీట్లు ఎన్ని? 119 చోట్ల పోటీచేస్తే చచ్చీచెడీ గెలిచింది ఒక్కటి. ఎన్నికల్లో అత్యధిక చోట్ల డిపాజిట్లు కోల్పోయిన రికార్డు కూడా బీజేపీకే దక్కింది కదా? రాష్ట్ర శాసనమండలిలో బీజేపీకి స్థానం సున్నా. రాష్ట్రంలో ఒక్క జడ్పీగానీ, మున్సిపల్ చైర్మన్ పదవిగానీ బీజేపీకి ఉన్నాయా? కనీసం 119 సీట్లలో వారికి అభ్యర్థులైనా ఉన్నారా? అంటే అనుమానమే. అలాంటి బీజేపీని చూసి కేసీఆర్ వణికిపోతున్నారని చౌహాన్ అంటారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు! నిజానికి బీజేపీని చూసి కేసీఆర్ కాదు.. కేసీఆర్‌ను చూసి బీజేపీ భయపడుతున్నది. తెలంగాణ అభివృద్ధి మోడల్‌ను దేశమంతా విస్తరిస్తాడేమోనని భయపడుతున్నది. అలా చేయకుండా ముందరికాళ్లకు బంధాలు వేసే విఫల ప్రయత్నం చేస్తున్నది.
దేశమంతా కరోనా వ్యాప్తి చెందుతున్నది. రోజువారీ కేసులు లక్ష దాటిపోయాయి. మహమ్మారికి భయపడి బీజేపీ అగ్రనేతలతోపాటు ఇతర పార్టీల నేతలు కూడా పర్యటనలు వాయిదా వేసుకొంటున్నారు. ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో కూడా టూర్లు రద్దు చేసుకొంటుంటే తెలంగాణకు మాత్రం ఒకరి తర్వాత ఒకరుగా బారులు తీరుతున్నారు. తెలంగాణలో ఇప్పుడేమైనా ఎన్నికలున్నాయా? తెలంగాణలో కరోనా వ్యాప్తి జరిగినా ఫర్వాలేదా? తెలంగాణ ప్రజలవి ప్రాణాలు కావా? వారు వైరస్ బారిన పడినా మీకేం పట్టదా? బీజేపీ సభల్లో భౌతికదూరం మాట దేవుడెరుగు.. కనీసం మాస్కులు కూడా పెట్టుకోవటంలేదు. శుక్రవారం వేదికపై చౌహాన్ పక్కనే కూర్చున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా మాస్కు పెట్టుకోలేదు. అయినా బీజేపీ నేతలంతా ఇక్కడికి ఎందుకొస్తున్నారు? ఒక్క కేసీఆర్‌ను ఎదిరించటానికి పదుల సంఖ్యలో బీజేపీ నేతలు పూటకొకరు చొప్పున వస్తుంటే, కేసీఆర్‌ను చూసి బీజేపీ భయపడుతున్నట్టా? బీజేపీని చూసి కేసీఆర్ భయపడుతున్నట్టా?
చచ్చీచెడీ గెలిచిన హుజూరాబాద్లాంటి ఒకటీ అరా ఎన్నికలను చూసి కేసీఆర్ తోకముడిచి పారిపోయాడట. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఓటమిని హుందాగా ఒప్పుకొనే ధైర్యం కేసీఆర్‌కు ఉన్నది. చౌహాన్లాగా, మోదీలాగా ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పొడిచి ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రత్యర్థి గెలుపును ఓటమిగా, తన ఓటమిని గెలుపుగా మార్చుకొనే మాయలమారి రాజకీయం కేసీఆర్ ఎప్పుడూ చూయలేదు.. చేయరు. భయపడుతున్నది, పారిపోతున్నది బీజేపీ ఎంపీలే. కేసీఆర్‌కు బండి సంజయ్ కలలో కనిపించటంకాదు.. బండికే కేసీఆర్ కలలో కనిపిస్తున్నడు. అందుకే తోడుకోసం ఇతర రాష్ర్టాల నేతలను తెచ్చుకొంటున్నడు. నిన్నటికి నిన్న షోషల్‌మీడియాలో మార్ఫింగ్ ఫొటోలు, కార్టూన్లు పెట్టిన మీ ఎంపీకి నోటీసులు ఇవ్వటానికి పోలీసులు వెళ్తే కనిపించకుండా పారిపోయిన విషయం మీకు తెలియదేమో! ఎవరికి ఎవరు కలలో కనిపిస్తున్నారో మీ ఎంపీలను ప్రైవేటుగా అడిగితే తప్పకుండా చెప్తారు.
సీఎం కేసీఆర్ అవినీతిపరుడని చౌహాన్ సెలవిచ్చారు. తెలంగాణలో గత ఏడేండ్లలో ఒక్క అవినీతి కుంభకోణమైనా ఉన్నదా? ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ అయినా వచ్చిందా? సమర్థులైన మీ పాలనలో మధ్యప్రదేశ్‌లో ప్రకంపనలు సృష్టించిన వ్యాపం కుంభకోణం మర్చిపోయారు. మీ కుటుంబసభ్యులు, మంత్రులు, ఉన్నతాధికారులు రాష్ట్రంలో బంట్రోతు నుంచి డాక్టర్ వరకు ఉద్యోగాలన్నీ అంగట్లో అమ్ముకున్న దుర్మార్గాన్ని చూసి దేశమంతా ముక్కున వేలేసుకున్న సంగతి గుర్తులేదా? ఈ కుంభకోణం ఆఖరుకు మీ గవర్నర్ కార్యాలయాన్నీ తాకిన సంగతి మర్చిపోయారా? ఈ కుంభకోణంలో ఎంతమంది సాక్షులు, బాధితులు రైలుపట్టాలపై, రోడ్లపక్కన శవాలుగా తేలారో లెక్కేలేదు కదా? ఆ హత్యలన్నీ ఎవరుచేశారు?
తెలంగాణలో భజనపరులకే అవకాశాలా? భజన చెయ్యనందుకే కదా మీ తోకకోసి మోదీ మిమ్మల్ని పక్కన పెట్టిండు. మళ్లీ మోదీకి భజన చేయటంవల్లనే కదా సీఎం పీఠం ఎక్కించిండు! అందరూ నీలాగే ఉంటారంటే ఎలా శివరాజ్‌సింగ్ చౌహాన్ జీ?
బీజేపీ కార్యకర్తలంతా జైలుకు వెళ్లటానికి సిద్ధంగా ఉన్నారని మీరు అంటున్నారు! మీ కార్యకర్తలే కాదు, మీ నేతలు కూడా కటకటాలు లెక్కబెట్టడానికి సిద్ధంగా ఉండాలి. దొంగ ప్రచారాలు, తప్పుడు చర్యలకు పాల్పడిన ప్రతి ఒక్కడు జైలుకు పోవుడు ఖాయం. మీ మోదీలాగా ఐటీ, ఈడీ, ఎన్ఐఏలను అక్రమంగా వాడుకోరు.. ఇక్కడ బాజాప్తా చర్యలు తీసుకొంటారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమట! 2013 సంగతి దేవుడెరుగు.. పంజాబ్‌లో ఇప్పుడు మీ పీఎంకు ఏమైందో, యూపీలో ఏం జరుగబోతున్నదో, ఢిల్లీ 2024లో ఏమైతదో ఆలోచించుకోండి. 2018లో మీ రాష్ట్ర ప్రజలే మీకు వాతలు పెట్టిన విషయం మర్చిపోవద్దు. మీరా నీతులు చెప్పటానికి వచ్చింది?
తప్పెవరు చేసినా జైలుకు వెళ్లక తప్పదు.. జైలుకు వెళ్లినవాళ్లంతా శ్రీకృష్ణులు కాదు!నీతిమంతులూ కాదు!
తెలంగాణ సీఎం హై.. సబ్ సహీ హై
మా ఉత్తరప్రదేశ్‌లో పని లేదు. అందుకే పని వెతుక్కుంటూ తెలంగాణకు వచ్చినం. మేము బీదోళ్లం. అక్కడ రోజూ తిండి కూడా దొరకదు. యోగి సర్కార్ పాలనలో మాకు ఏ పనీ దొరకటం లేదు.
తెలంగాణలో పనులు బాగున్నయ్. ఇక్కడి సర్కారు మంచిగున్నది. తెలంగాణ సీఎం ఇక్కడ అన్నీచేస్తున్నడు. ఏడేండ్ల నుంచి పనికోసం ఇక్కడికి వస్తున్నం. అక్కడ సౌకర్యాలేమీ లేవు. ఇక్కడ అన్ని సౌకర్యాలున్నయ్. అందుకే యూపీని వదిలి ఇక్కడికి వచ్చినం.
తెలంగాణకు వ్యవసాయ కూలీ పని కోసం ఉత్తర ప్రదేశ్ నుంచి వలస వచ్చిన వికాస్ సింగ్ అన్న మాట ఇది.. (నిజామాబాద్ బీజేపీ ఎంపీ గారూ వింటున్నారా?.. ఆయన వచ్చింది మీ జిల్లాకే)