హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో సాంకేతికతను అడ్డంపెట్టుకొని ప్రతిపక్షం గొంతును నొక్కుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైనుంచి ఎలాంటి ఆదేశాలు ఉన్నాయో తెలియదు కానీ.. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేటప్పుడు సాంకేతికతను బాగా ఉపయోగించి, వారిని, వారి క్లిప్పింగ్స్‌ను స్క్రీన్‌పై కనిపించకుండా చేస్తున్నారనే ఆరోపణలు పెరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన దగ్గర్నుంచి ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమను స్క్రీన్‌లో చూపించడం లేదనే ఆరోపణలకు బలం చేకూర్చుతూ అసెంబ్లీ పీసీఆర్ (ప్రొడక్షన్ కంట్రోల్ రూమ్) సిబ్బంది తెలివిగా కెమెరాలను ఆపరేట్ చేస్తున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చ సందర్భంగా ఏవైనా వార్తా క్లిప్పింగ్స్, రిపోర్టులు, ఫ్లకార్డులు ప్రదర్శిద్దామని వాటిని టేబుల్పైనుంచి తీసేలోపే కెమెరా ఫేడ్ అవుట్ అయిపోతున్నది. సదరు సభ్యుడు ఆ క్లిప్పింగ్, పేపర్ ప్రింట్‌ను మళ్లీ టేబుల్‌పై పెట్టే వరకూ స్క్రీన్ మీద స్పీకర్‌ను మాత్రమే చూపిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలా ఎంతసేపు ఆ క్లిప్పింగ్ పట్టుకుంటే.. అంతసేపూ అవుట్‌పుట్‌లో స్పీకరే కనిపిస్తున్నారు తప్ప.. ఆ పేపర్ క్లిప్‌లో ఉన్న అంశం ప్రజలకు తెలియనివ్వడం లేదు. ఇలా ప్రతీసారిరీ, పదేపదే జరుగుతున్నది. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ క్లిప్పింగ్స్ ప్రదర్శిస్తే.. మాత్రం అవి స్క్రీన్‌పై కనిపించేలా పీసీఆర్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్కోసారి ఆ క్లిప్పింగ్స్‌ను జూమ్ చేసి మరీ చూపిస్తున్నారు. ఈ వివక్షపై కొందరు నెటిజన్లు అసెంబ్లీ సీపీఆర్ సిబ్బంది తీరుపై సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేలైతే మా వీడియోలు చూపించండి అంటూ పదేపదే సభలోనే కోరుతున్నారు.