SC Residential School | పైసలు కొట్టు.. క్లీన్చిట్ పట్టు..! ఎస్సీ గురుకులంలో నయాదందా
పైసలు ముట్టజెప్పితే ఒక నీతి.. లేదంటే మరో రీతి అన్నట్టుగా తయారైంది ఎస్సీ గురుకుల సొసైటీలో పరిస్థితి. సస్పెన్షన్లు చేయడం, ఆపై క్లీన్చిట్ ఇవ్వడం పరిపాటిగా మారింది. అందులోనూ నచ్చినోళ్లకు ఒకవిధంగా, నచ్చనివారికి మరోవిధంగా వ్యవహరిస్తున్న తీరు పోస్టింగ్‌ల్లోనూ స్పష్టంగా కనబడుతున్నది.
- ఎస్సీ గురుకులంలో నయాదందా
- ఫుడ్‌పాయిజన్ ఘటనల్లోనూ కేసులు
- విస్తుపోతున్న సొసైటీ ఉద్యోగులు
- ఫుడ్‌పాయిజన్ కేసుల్లోనూ నేడు అందరికీ క్లీన్చిట్లు
- పూర్తికాల వేతనాల చెల్లింపు
- సొసైటీ ఉద్యోగుల విస్మయం
- తెరవెనుక ఓ ఉన్నతాధికారి లీలలే కారణమని ఆరోపణలు
- రెండున్నరేండ్లలో గురుకులాల్లో 126 ఫుడ్‌పాయిజన్ కేసులు
- 2,673 మంది విద్యార్థులు దవాఖాన పాలు
- పదుల సంఖ్యలో హెచ్ఆర్సీలో కేసులు.. పట్టించుకోని సర్కార్
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): పైసలు ముట్టజెప్పితే ఒక నీతి.. లేదంటే మరో రీతి అన్నట్టుగా తయారైంది ఎస్సీ గురుకుల సొసైటీలో పరిస్థితి. సస్పెన్షన్లు చేయడం, ఆపై క్లీన్చిట్ ఇవ్వడం పరిపాటిగా మారింది. అందులోనూ నచ్చినోళ్లకు ఒకవిధంగా, నచ్చనివారికి మరోవిధంగా వ్యవహరిస్తున్న తీరు పోస్టింగ్‌ల్లోనూ స్పష్టంగా కనబడుతున్నది. అమాత్యుడి అండదండలతో సొసైటీ ప్రధాన కార్యాలయంలో చక్రం తిప్పుతున్న ఓ ఉన్నతాధికారి అందినకాడికి దండుకొంటున్నారనే ఆరోపణలు సొసైటీలో సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇప్పటికీ ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఫిర్యాదులు అందినా సదరు అధికారిపై సర్కార్ ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం అందుకు బలాన్ని చేకూర్చుతున్నది.
ఇష్టారీతిన విచారణ.. క్లీన్చిట్
గురుకులాల్లో సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సందర్భాల్లోనో, అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడో శాఖాపరమైన విచారణలు చేపట్టడం పరిపాటి. ఆ నివేదికల ఆధారంగా సదరు అధికారులపై చర్యలు తీసుకోవడం, విచారణలో ఆ అధికారి తప్పు లేదని తేలితే మోపిన అభియోగాలన్నీ రద్దు చేయడం సర్వసాధారణంగా కొనసాగే ప్రక్రియ. అయితే, ఈ రకమైన విచారణలు ఎస్సీ గురుకుల సొసైటీలో పూర్తిగా గాడితప్పాయి. కాసులు సమర్పించనిదే ఫైల్ కదలదు. పైసలు సమర్పిస్తే చాలు, అవినీతి ఆరోపణలన్నీ రద్దు చేసి, క్లీన్చిట్ ఇస్తున్న పరిస్థితి. ఉదాహరణకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఓ ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీలో బీరు సీసాలు ఉన్నాయనే నెపంతో, చిన్నపాటి కారణాలతో అక్కడి ప్రిన్సిపాల్‌పై వేటు వేశారు. బదిలీ చేయడంతోపాటు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. దాదాపు రెండేండ్లు గడుస్తున్నా సదరు ప్రిన్సిపాల్‌పై మోపిన అభియోగాలపై విచారణ చేపట్టడం లేదు. దీంతో సదరు ప్రిన్సిపాల్‌కు రావాల్సిన ప్రమోషన్ దక్కకుండా పోతున్నది.
ఈ ఏడాది ఫిబ్రవరిలోనే హనుమకొండ జిల్లాలో ఓ ఎస్సీ బాలికల గురుకులంలోని విద్యార్థినులను అక్కడి ప్రిన్సిపాల్ ఇష్టారీతిన జుట్టుపట్టుకుని చితకబాదారు. ఆ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. సదరు ప్రిన్సిపాల్‌ను తాత్కాలికంగా వేరొక గురుకులానికి బదిలీ చేశారు. అంతేకాదు, ఆగమేఘాల మీద విచారణ ప్రారంభించి, పూర్తి చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ గురుకులంలో ఫుడ్‌పాయిజన్ ఘటన జరిగింది. ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఘటన జాతీయ మానవ హక్కుల కమిషన్ వరకు వెళ్లింది. దీంతో అక్కడి ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు. విచారణకు ఆదేశించారు. ఇటీవల సదరు ప్రిన్సిపాల్‌కు క్లీన్చిట్ ఇవ్వడంతోపాటు, సస్పెన్షన్ కాలంలో నిలిచిపోయిన పూర్తి వేతనాలను సైతం చెల్లించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ గురుకుల టీచర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, గురుకుల ప్రాంగణంలోనే రచ్చరచ్చ జరుగడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సదరు టీచర్ దాదాపు మూడేండ్లపాటు సస్పెన్షన్‌కు గురయ్యారు. సదరు టీచర్‌కు సైతం ఇటీవలనే క్లీన్చిట్ ఇచ్చి పూర్తికాలపు వేతనం చెల్లించారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇటీవల కాలం లో పదుల సంఖ్యలో సిబ్బందికి ఇదే రీతిన క్లీన్చిట్లు ఇస్తూపోతున్నారు. సొసైటీ వ్యవహారంపై ఉద్యోగులే విస్మయం వ్యక్తంచేస్తున్నారు.
పోస్టింగ్‌ల్లోనూ అదే తీరు
ఎవరికైనా సరే ఫోకల్ టు ఫోకల్ పోస్టింగ్ ఇవ్వకూడదు. కానీ, సొసైటీ ఉన్నతాధికారులు ఆ నిబంధనలకు పాతరేస్తూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఉద్యోగులకు లబ్ధిచేకూర్చుతూ వ్యక్తిగతంగా లబ్ధి పొందుతున్నారనే విమర్శలున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఓ ప్రిన్సిపాల్‌ను ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలోని విక్టోరియా మెమోరియల్ అనాథ ఆశ్రమం ప్రిన్సిపాల్‌గా డిప్యుటేషన్‌పై నియమించారు. సదరు ప్రిన్సిపాల్ ఉద్యోగ విరమణ పొందే క్రమంలో మదర్ డిపార్ట్మెంట్కు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అయితే, కేవలం నాలుగు రోజుల ముందు సదరు ప్రిన్సిపాల్‌కు 24% హెచ్ఆర్ఏ పరిధిలోని ఓ గురుకులం ప్రిన్సిపాల్‌గా నియమించారు. ఫోకల్ టు ఫోకల్ పోస్టులోనే పోస్టింగ్ కల్పించారు. ప్రిన్సిపాల్ ఉద్యోగ విరమణ నేపథ్యంలో విక్టోరియా మెమోరియల్ హోం ప్రిన్సిపాల్‌గా మరొకరిని డిప్యుటేషన్‌పై నియమించారు. అదేలా ఉన్నదంటే సొసైటీ ప్రధాన కార్యాలయంలో డిప్యుటేషన్‌పై సుదీర్ఘకాలంపాటు కొనసాగి, తదనంతరం ఉద్యోగుల ఒత్తిడి మేరకు ఖమ్మం జిల్లాకు వెళ్లిపోయిన ప్రిన్సిపాల్‌నే మళ్లీ డిప్యుటేషన్‌పై వీఎం హోంకు తీసుకొచ్చారు. వాస్తవంగా సదరు పోస్టుకు అన్ని అర్హతలున్న సీనియర్ ప్రిన్సిపాల్స్ ఎంతోమంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ, వారందరినీ పక్కనపెట్టడం గమనార్హం. ప్రతి పోస్టింగ్‌లోనూ ఉన్నతాధికారులు ఇదే తీరుగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు బాహాటంగానే మండిపడుతున్నారు.
రెండున్నరేండ్లలో 126 ఘటనలు
ఎస్సీ గురుకులంతోపాటు ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్, కస్తూర్బా గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో నిత్యం ఎక్కడో ఒకచోట ఫుడ్‌పాయిజన్ కేసులు నమోదవ్వడం పరిపాటిగా మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెండున్నరేండ్లలో దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 126 గురుకులాల్లో ఫుడ్‌పాయిజన్ ఘటనలు జరిగాయి. ఫలితంగా 2,673 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై దవాఖానల పాలయ్యారు. భువనగిరి ఎస్సీ గురుకులంలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం అప్పటికప్పుడు పరిస్థితి తీవ్రతను బట్టి స్థానిక సిబ్బందిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం తప్ప చేస్తున్నదేమీ లేకుండా పోయింది. ఫుడ్‌పాయిజన్ ఘటనలకు కారకులు ఎవరు? కారణాలేమిటి? అనే దానిపై సమగ్ర విచారణ జరుపడం లేదు. పైగా సస్పెండ్ చేసిన ఉద్యోగులకు క్లీన్చిట్లు ఇస్తూ రావడం చర్చనీయాంశంగా మారింది. ఫుడ్‌పాయిజన్ ఘటనలపై మానవ హక్కుల కమిషన్‌లో పదుల సంఖ్యలో ఫిర్యాదులు నమోదయ్యాయి. కమిషన్ సైతం పూర్తిస్థాయి నివేదికలను సమర్పించాలని సొసైటీల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కానీ, సొసైటీ ఉన్నతాధికారులు, ప్రభుత్వం ఇప్పటికీ నివేదికలను సమర్పించడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
తెరవెనుక ఉన్నతాధికారి లీలలు.. అమాత్యుడి అండదండలు..
సొసైటీలో ఇష్టారీతిన పోస్టింగ్‌లు, క్లిన్చీట్లు ఇస్తున్న వ్యవహారంలో ప్రధాన కార్యాలయంలో ఓ ఉన్నతాధికారి పేరు ప్రముఖంగా వినవస్తున్నది. అసలు సదరు అధికారి నియామకమే అక్రమమని సొసైటీ ఉద్యోగులు ఇప్పటికే గగ్గోలు పెడుతున్నారు. అర్హతలు లేకున్నా దొడ్డిమార్గంలో ఉన్నతస్థాయి పోస్టులో కూర్చున్నారని ఆరోపిస్తున్నారు. ఎక్కడ తన సీటుకు ఎసరొస్తుందోనని ప్రమోషన్లను సైతం అడ్డుకొంటున్నారని సొసైటీ ఉపాధ్యాయులు, ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇదేవిషయమై అమాత్యుడికి సైతం ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేకసార్లు ఫిర్యాదులు చేశారు. ప్రస్తుతం అదే అధికారి సొసైటీలో చక్రం తిప్పుతూ ఇష్టారీతిన వసూళ్లకు పాల్పడుతున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగ విరమణ సమయం సమీపిస్తున్న నేపథ్యంలో వసూళ్లకు తెరలేపారని, ఇష్టారీతిన క్లీన్చిట్లు, పోస్టింగ్‌లు ఇవ్వడం అందులో భాగంగా కొనసాగుతున్నాయని ఉద్యోగులు వివరిస్తున్నారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా సదరు ఉన్నతాధికారిపై ప్రభుత్వం, అమాత్యుడు స్పందించకపోవడంపై సొసైటీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిప్పులు చెరుగుతున్నారు. మంత్రి అండదండలతోనే సదరు అధికారి రెచ్చిపోతున్నారని, సొసైటీలోనూ అదే ప్రచారం చేసుకుంటున్నారని వివరిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

