సంగారెడ్డి, జూన్ 30(నమస్తే తెలంగాణ)/ఖిలావరంగల్: ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న బీజేపీ కార్యకర్తల సమావేశా లు గొడవలకు దారితీస్తున్నాయి. పలు జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులే కన్పించాయి. నియోజకవర్గ స్థాయిలో నేతల మధ్య ఉన్న గ్రూపు తగాదాలు పార్టీ సమావేశాల్లో బయటపడుతున్నాయి. ఎమ్మెల్యే ఆశా వహులు పార్టీ ఇంచార్జీల ఎదుటే బలప్రదర్శనకు దిగడం అంతర్గత విబేధాలకు దారితీస్తున్నది. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో గురువారం జరిగిన అందోల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం రసాభసాగా మారింది. మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్, మాజీ జడ్పీ చైర్మన్ బాల య్య అనుచరుల మధ్య తోపులాట జరిగింది. అందోలు ఇంచార్జి, బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమ్జీ శుక్లా ఎదుటే బాబూమోహన్, బాలయ్య వర్గీయులు ఘర్షణకు దిగారు. దీంతో ఇంచార్జి ప్రేమ్జీశుక్లా అర్ధాంతరంగా సమావేశం నుంచి వెళ్లిపోయా రు.
వరంగల్లో నిరసన..
కాగా వరంగల్ బీజేపీ కార్యాలయం ఎదుట మహిళ మోర్ఛా, దళిత మోర్ఛా నాయకులు నిరసనకు దిగారు. బ్యానర్లు, ఫెక్సీల్లో దళిత మోర్ఛా, మహిళా మోర్ఛా నాయకుల ఫొటోలు పెట్ట లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీలు, మహిళలను గుర్తించరా?.. అంటూ కేంద్ర మాజీ మంత్రి మాట్లాడుతుండగానే తూర్పు నియోజక వర్గానికి చెందిన దళిత మోర్ఛా, మహిళా మోర్ఛా కార్యకర్తలు సమావేశం నుంచి బయటకు వెళ్లి నిరసనకు దిగారు.