పెద్దఅంబర్‌పేట, సెప్టెంబర్ 24: ఓ భూమి విషయమై రైతులు, వెంచర్ నిర్వాహకుల మధ్య ఏర్పడిన గొడవ.. రాళ్లు, కర్రల దాడి వరకు వెళ్లిన ఘటన మంగళవారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పిగ్లీపూర్‌లో చోటుచేసుకుంది. పిగ్లీపూర్‌లోని సర్వే నంబర్ 17లో గోపాల్‌యాదవ్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నారు. గ్రామంలోని పలువురు రైతులు వెంచర్లోకి వెళ్లి.. ఇందులో సర్కారు పట్టాలు ఇచ్చిన సీలింగ్ భూమి ఉన్నదంటూ ట్రాక్టర్‌తో పనులు చేసేందుకు యత్నించారు. దీనిని వెంచర్ నిర్వాహకులు, సిబ్బంది అడ్డుకుంటుంటే.. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకుకోగా పోలీసులు చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు.
ఘర్షణల్లో గాయపడ్డ రైతుల్లో పంది ముత్తయ్య, నర్సింహ, ఆకుల సత్యనారాయణ, శంకర్, మరో ఇద్దరు ఉండగా.. వెంచర్ నిర్వాహకుల్లో లోకేశ్, దర్శన్‌రెడ్డి, మరొకరు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వనస్థలిపురం ఏసీపీ, అబ్దుల్లాపూర్‌మెట్ సీఐ అంజిరెడ్డి సిబ్బందితో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. వెంచర్ నిర్వాహకులు సంప్రదింపుల కోసం పిలిచి దాడి చేశారని, కులం పేరుతో దూషించారని రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంచర్లోకి అక్రమంగా చొరబడిన కొందరు స్థానికులు వెంచర్ నిర్వాహకులు, సిబ్బందిపై దాడికి దిగారని ఫిర్యాదు చేశారు.
ఇరువురి ఫిర్యాదుల మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా.. పిగ్లీపూర్ గ్రామంలో తమకు ప్రభుత్వం సీలింగ్ భూములిచ్చి పట్టాలు అందజేసిందని, ఆ భూముల్లోకి జరిగి కొందరు వెంచర్ చేస్తున్నారని, దీనిపై మండల రెవెన్యూ అధికారులు, హెచ్ఎండీఏ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతులు ఆరోపించారు. గతంలో ఉన్న మండల రెవెన్యూ అధికారిణి ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చారని విమర్శించారు. వెంచర్ నిర్వాహకులు మాట్లాడుకుందామని పిలిచి, మహిళలు, పెద్ద మనుషులపై సిబ్బందితో దౌర్జన్యంగా రాళ్లు, కర్రలతో దాడిచేయించారని వాపోయారు. మరోవైపు, తమ వెంచర్‌లోని సర్వేనంబర్‌లో ఎలాంటి సీలింగ్ భూమి లేదని నిర్వాహకులు చెప్తున్నారు.