Civil Works | హైదరాబాద్, నవంబర్ 6(నమస్తే తెలంగాణ): రెండేండ్లుగా పెండింగులో ఉన్న రూ.36,000 కోట్ల బిల్లుల బకాయిలను ఈ నెలాఖరులోగా చెల్లించకుంటే డి సెంబర్ ఒకటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల పరిధిలో పౌరసంబంధ (Civil Works) పనులను నిలిపివేయనున్నట్టు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) ప్రకటించింది. ముందుగా ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఫైనాన్స్, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో సంయుక్త సమావేశాన్ని ఏర్పాటుచేసి బకాయిల చెల్లింపుపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం అసోసియేషన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులకు వినతిపత్రాలను సమర్పించారు.
అనంతరం బీఏఐ జాతీయ ఉపాధ్యక్షుడు డీవీఎన్ రెడ్డి, రాష్ట్ర శాఖ చైర్మన్ యూ సురేందర్ సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్టర్ల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరారు. చిన్న, మధ్యతరహా కాంట్రాక్టర్లు తమ ఆస్తులను తాకట్టు పెట్టి, అధిక వడ్డీలకు రుణాలు తీసుకొని పనులు నిర్వహించారని, ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో వారిపై తీవ్ర ఆర్థికభారం పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు ఇప్పుడు బిల్లులు చెల్లించే అవకాశం లేదని కొందరు అధికారులు చెప్పడం సబబుకాదని అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. తాము ఏ ప్రభుత్వం ఉన్నా పనులు చేస్తామని, తమకు రాజకీయాలను ఆపాదించవద్దని వారు కోరారు.