Paddy Procure | హైదరాబాద్ : ధాన్యం కొనుగోలులో తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ మిల్లర్లను హెచ్చరించారు. కొనుగోలు కేంద్రంలో వేసిన తూకమే ఫైనల్ అని, ఆ తర్వాత మిల్లుల్లో తాలు, తేమ పేరుతో తరుగు తీస్తే ఊరుకునేది లేదని, కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఈ మేరకు మంగళవారం ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాలు మేరకు తాలు, తరుగుపై పత్రికల్లో వస్తున్న వార్తలపై విచారణ జరిపి వాస్తవ పరిస్థితులతో నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కొన్ని జిల్లాల్లో ధాన్యం దించుకోవడంలో మిల్లర్లు జాప్యం చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే దించుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యాన్ని తీసుకువచ్చిన రైతులు.. తమ ధాన్యం అమ్ముకోవడానికి వేచిచూసే పరిస్థితి లేకుండా కొనుగోలు జరపాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు, తరలింపులో లారీలు హామాలీల కొరత లేకుండా వ్యవసాయ, రెవెన్యూ, రవాణా, సహకార తదితర విభాగాలతో క్షేత్ర స్థాయిలో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ధాన్యం కొనుగోలులో ఎలాంటి సమస్యలు ఏర్పడినా అధికారులకు ఫిర్యాదు చేయాలని రైతులకు కమిషనర్ సూచించారు. తాలు తరుగు పేరుతో మిల్లర్లు నుంచి ఎదురవుతున్న సమస్యలతో పాటు ధాన్యం కొనుగోలు, ధాన్యం రవాణా, కనీస మద్ధతు ధర తదితర ఫిర్యాదుల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. దీంతో పాటు హైదరాబాద్‌లోని ఫౌరసరఫరాల భవన్లో 1967, 180042500333 టోల్ ఫ్రీ నంబర్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.