హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): విమానాల్లో బాంబులు పెట్టామని బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర పౌర విమానాయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు. విశాఖపట్నం -విజయవాడల మధ్య కొత్తగా రెండు విమాన సర్వీసులను ప్రారంభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సోషల్మీడియాలో వచ్చిన బాంబు బెదిరింపులపై విచారణ కొనసాగుతున్నదని, బెదిరింపులకు పాల్పడే వ్యక్తులను అణచివేసేందుకు రానున్న రోజుల్లో చట్టం తీసుకొస్తామని వెల్లడించారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ సైతం సీరియస్గా ఉన్నట్టు పేర్కొన్నారు. 2025 జూన్ నాటికి భోగాపురం విమానాశ్రయం సిద్ధమవుతుందని తెలిపారు.