హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీస్‌స్టేషన్(సీసీఎస్)లో నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ప్రక్షాళన చర్యలు షురూ చేశారు. సీసీఎస్ సిబ్బందిపై అవినీతి ఆరోపణలు, ఏసీబీ దాడుల నేపథ్యంలో అలాంటివారిపై సీరియర్‌గా దృష్టిపెట్టారు.
సాహితీ ఇన్ఫ్రా కేసు దర్యాప్తు చేసిన ఏసీపీ ఉమాహేశ్వర్రావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదుకావడం, రాజీ అయిన కేసును క్లోజ్ చేయడానికి రూ.15లక్షలు డిమాండ్ చేసి ఇన్స్పెక్టర్ సుధాకర్ రూ.3లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడడం, ఇదే కేసులో ఏసీపీ రాంరెడ్డికి కూడా సంబంధం ఉందని ఆరోపణలు రావడం నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ కఠిన చర్యలు చేపట్టారు.
సీసీఎస్‌లో అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ఉండాలని బదిలీల ప్రక్రియ మొదలుపెట్టారు. మొదటి దఫాలో 12 మంది ఇన్స్పెక్టర్లను మల్టీజోన్-2కు సరెండర్ చేశారు. వీరిలో కొందరు ఎన్నికల సందర్భంగా జిల్లాల నుంచి వచ్చిన వాళ్లున్నారు. వీరితోపాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారిని మల్టీజోన్కు సరెండర్ చేశారు. సరెండరైన వారిలో ఇన్స్పెక్టర్లు శివగోని శివశంకర్, రఘుబాబు కోలమాల, మీసాల అప్పల నాయుడు, భూక్య రాజేశ్, సీతారాములు, హుస్సేన్ ధీరావత్, గుమ్మిడాల సత్యం, చీపుర్ల నాగేశ్వర్‌రెడ్డి, ధరావత్ కృష్ణ, కొత్త సత్యనారాయణ, ఎస్ఏ ఇమ్మాన్యుయేల్, బిట్టు క్రాంతికుమార్ ఉన్నారు.