హైదరాబాద్ : ఢిల్లీ మద్యం పాలసీతో సంబంధం లేని తనపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సాలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సిటీ సివిల్ కోర్టులో మంగళవారం పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కోర్టు ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితపై ఎవరూ వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు తెలిపింది. సోషల్ మీడియాతో పాటు మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 13కు కోర్టు వాయిదా వేసింది.
హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు 9వ చీఫ్ జడ్జి ముందు కవిత ఇన్జంక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. ఎంపీ పర్వేశ్ వర్మ, మంజీందర్సింగ్ సిర్సా తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు, నిరాధార ఆరోపణలు చేసి.. ప్రజాజీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించే ప్రకటనలు చేశారని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. తన గౌరవమర్యాదలను, ప్రతిష్ఠను మసకబార్చేందుకు వారు అక్రమ పద్ధతులను ఎంచుకున్నారని ఆమె తెలిపారు. తనపై చేసిన ఆరోపణల్లో ఒక్కటి కూడా నిజంలేదని స్పష్టంచేసిన ఎమ్మెల్సీ కవిత.. తనపై ఆరోపణలు చేసిన బీజేపీ నేతలు బేషరతుగా క్షమాపణ చెప్పేలా ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని కోరిన విషయం విదితమే.