హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): ఉపాధి కోసం తెలంగాణకు వస్తున్న పలు రాష్ర్టాల కార్మికులకు తెలంగాణ పోలీసులు అండగా ఉంటారని, ఎవరైనా వారిని వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐడీ ఏడీజీ మహేశ్ ఎం భాగవత్ హెచ్చరించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లోని ఇటుక బట్టీల యజమానులు పని పేరుతో ఒడిశా కూలీలను తీవ్రంగా వేధిస్తుండటంతో ఆయన ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, 61 మంది వలస కూలీలకు విముక్తి కల్పించారు. ఇటీవల నారాయణపేట జిల్లాలోని కృష్ణ మండలం గుడెబల్లూర్ శివారులోని గజ్జి ఆంజినేయులు అనే వ్యక్తి ఒడిశాకు చెందిన వలస కూలీలను తీవ్రంగా ఇబ్బందులు పెట్టడం, సమయానికి డబ్బులు ఇవ్వకపోవడంతో వారు సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మహేశ్ భగవత్ ఆదేశాల మేరకు డీఎస్పీ శంకర్ నాయక్, ఇన్స్పెక్టర్ ప్రదీప్కృష్ణ, ఎస్సై విజయభాసర్, జిల్లా లేబర్ అధికారి రాజ్‌కుమార్, ఒడిశా రాష్ట్ర లైజన్ అధికారి రమేశ్ ఇటుక బట్టీ వద్దకు వచ్చి కూలీలు, యజమానిని విచారించారు. అనంతరం అకడ పని చేస్తున్న 48 మంది కూలీలను యజమాని ఖర్చులతో వారి స్వగ్రామాలకు పంపించారు.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం పోతారంలో ఓ ఇటుక బట్టీలో పని చేస్తున్న 13 మంది ఒడిశా కార్మికులను యజమాని తిరుపతి నిత్యం వేధిస్తున్నాడు. పని పేరిట చిత్రహింసలకు గురిచేస్తుండేవాడు. కార్మికులు బట్టీ నుంచి బయటికి వెళ్లాలన్నా నిర్బంధిస్తుండటంతో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం సీఐడీ ఏడీజీ మహేశ్ భాగవత్‌కు తెలియడంతో ఈనెల 23న కరీంనగర్ సీఐడీ డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇటుక బట్టీలపై దాడులు చేయించారు. ఏడుగురు పురుషులు, ఆరుగురు మహిళలను సొంత ఖర్చులతో స్వగ్రామాలకు పంపి, యజమానిపై చట్టపరంగా చర్యలు తీసుకున్నారు.
అభివృద్ధిలో వేగంగా దూసుకెళ్తున్న తెలంగాణలో హింసకు తావులేదు. ఇక్కడికి ఎంతోమంది కార్మికులు ఉపాధి కోసం వలస వస్తున్నారు. అలాంటి వారికి రక్షణ కల్పించే బాధ్యత మనందరిది. ఇటుక బట్టీలు, పరిశ్రమలు, ఇతర కర్మాగారాల్లో పని చేస్తున్నవారిని ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇక నుంచి ఇటుక బట్టీలపై ప్రత్యేక దృష్టి పెట్టి, స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తాం.
– మహేశ్ ఎం భాగవత్, సీఐడీ ఏడీజీ