Banking exams | బ్యాంకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే, హార్డ్‌వర్క్, మెరిట్ మాత్రమే ఉంటే సరిపోదు. మీ సిబిల్ స్కోర్ కూడా మెరుగ్గా ఉండాలి. ఏంటి అర్థం కాలేదా? బ్యాంకు పరీక్షలు రాసే అభ్యర్థులకు మంచి సిబిల్ స్కోర్ కూడా ఉండాలని కేంద్ర ఆర్థిక శాఖ కింద పనిచేసే ఐబీపీఎస్ కొత్త మెలిక పెట్టింది. ఈ నిబంధనపై అభ్యర్థులు భగ్గుమంటున్నారు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ గప్పాలు కొట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఆ హామీని నిలబెట్టుకోవడం ఎప్పుడో మానేసింది. అది చాలదన్నట్టు.. ప్రకటించే ఆ కొద్ది ఉద్యోగాలకు కూడా సవాలక్ష నిబంధనలు పెడుతున్నది. కేంద్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) తాజా బ్యాంకు ఉద్యోగ నోటిఫికేషన్లో అభ్యర్థులకు మెరుగైన సిబిల్ స్కోర్ ఉండాలంటూ తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎస్బీఐ మినహా దేశంలోని దాదాపు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నియామకాల కోసం ఐబీపీఎస్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో 4,545(అదనంగా 500 పోస్టులను కలిపారు) బ్యాంకు ఆఫీసర్లు, క్లర్కు పోస్టుల కోసం ఇటీవల సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతల్లో భాగంగా పరీక్ష రాసే అభ్యర్థులు కనీసం 650 సిబిల్ స్కోర్ కలిగి ఉండాలని నిబంధనల్లో పేర్కొన్నది. పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉద్యోగంలో చేరే సమయంలో మెరుగైన సిబిల్ స్కోరును సమర్పించాలని నిబంధన పెట్టింది. సిబిల్ స్కోరు మెరుగ్గా లేని అభ్యర్థులు రుణదాతల నుంచి ‘నో అబ్జెక్షన్’ లెటర్‌ను విధిగా సమర్పించాలని పేర్కొన్నది. బ్యాంకు ఖాతా లేని వారు సిబిల్ స్కోరు సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపింది. వీటిలో ఏ ఒక్కదానిని కూడా సంతృప్తిపరచకపోతే, ఉద్యోగ నియామకాన్ని రద్దు చేస్తామని హెచ్చరించింది.
ఐబీపీఎస్ తాజా నిబంధనలపై బ్యాంకు పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులు మండిపడుతున్నారు. ఉద్యోగం కోసం రేయింబవళ్లు కష్టపడి చదివితే, అర్థంపర్థం లేని నిబంధనలతో ఇ లాంటి వడబోతలేంటని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులు బ్యాంకు రుణాలు, క్రెడిట్ కార్డులు ఎందుకు తీసుకొంటారని ప్రశ్నిస్తున్నారు. చెల్లింపుల ప్రక్రియ కొనసాగనప్పుడు సిబిల్‌స్కోరు ఎలా మెరుగ్గా ఉంటుందని నిలదీస్తున్నారు. నిరుద్యోగులను మోసగించడానికే ఇ లాంటి అనాలోచిత నిబంధనలను ప్రభుత్వం తీసుకొస్తున్నదని ధ్వజమెత్తుతున్నారు.
20-28 ఏండ్ల మధ్య వయసున్న వాళ్లే క్లరికల్ జాబ్ కోసం దరఖాస్తు చేస్తారు. ఉద్యోగం లేని మాలాంటి గ్రాడ్యుయేట్లను మెరుగైన క్రెడిట్ స్కోర్ అడగడం అన్యాయం. – ఆర్ శ్రవణ్,
బ్యాంకు ఉద్యోగార్థి
బ్యాంకు ఖాతాలేని వాళ్లు సిబిల్ స్కోరు సమర్పించాల్సిన అవసరం లేదని ఐబీపీఎస్ నోటిఫికేషన్లో పేర్కొన్నది. ఈ రోజుల్లో బ్యాంకు ఖాతాలేని డిగ్రీ హోల్డర్లు ఉన్నారా? ప్రభుత్వం తాజా నిబంధనలపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
– ఆరాధ్య శర్మ, సక్సెస్ పాయింట్ బ్యాంక్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్, ఢిల్లీ