కమలాపూర్, మే 27: హనుమకొండ జిల్లా కమలాపూర్ సీఐ పీ మహేందర్‌రెడ్డి అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో సస్పెండ్ చేస్తూ వరంగల్ సీపీ తరుణ్‌జోషీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐదు నెలల క్రితం పరకాల నుంచి కమలాపూర్ సీఐగా బదిలీపై వచ్చిన ఈయన అనతి కాలంలోనే ఇసుక ట్రాక్టర్లు పట్టుకొని డ్రైవర్లు, యజమానులపై క్రిమినల్ కేసులు పెట్టి నెలవారీ వసూళ్లు చేసినట్టు అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి.
సివిల్ తగాదాల్లో తలదూర్చి సెటిల్మెంట్లు చేస్తూ పెద్ద ఎత్తున డబ్బులు గుంజినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బాధితులు, నిందితుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ బెదిరింపులకు పాల్పడినట్టు సమాచారం. ఈయనపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిన అధికారులు శుక్రవారం సస్పెండ్ చేశారు.