హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): వయోవృద్ధుల దర్శనంపై జరుగుతున్న దష్ప్రచారాన్ని నమ్మొద్దని భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం కోరింది. తప్పుదోవ పట్టించేలా ఈ దర్శనాలపై సోషల్ మీడియాలో కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది.
రోజుకు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ మూడు నెలలు ముందుగానే ఆన్లైన్ కోటాను విడుదల చేస్తుందని తెలిపింది. టికెట్ పొందిన వ్యక్తికి రూ.50 లడ్డూ ఉచితంగా ఇస్తున్నట్టు పేర్కొన్నది. తిరుమల నంబి ఆలయానికి చేరుకున్న సీనియర్ సిటిజన్, పీహెచ్సీ లైన్ ద్వారా రోజూ మధ్యాహ్నం 3గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారని స్పష్టం చేసింది.