పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన ఆర్చరీ క్రీడాకారిణి (Archery player) తానిపర్తి చికీత(Chiquita) ఏషియన్ గేమ్స్(Asian games)-2023కు ఎంపికైంది. ఈ మేరకు ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ అసిస్టెంట్ సెక్రెటరీ గుంజాన్ అబ్రోల్ భారత దేశం తరపున ఆర్చరీ కంపౌండ్ ఉమెన్‌గా తానిపర్తి చికీతను ఎంపిక చేస్తూ 11న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 29 నుంచి మే 6వరకు ఉజకిస్థాన్( Uzbekistan) దేశంలోని తాష్కెంట్లో జరగనున్న ఏషియన్ గేమ్స్‌లో చికీత పాల్గొననున్నది.
చికీత ఆడే కంపౌండ్ విమెన్ విభాగంలో నలుగురు, రికర్వ్ విభాగంలో నలుగురు, పురుషుల రికర్వ్ విభాగంలో నలుగురు, కాంపౌండ్ విభాగంలో నలుగురు చొప్పున ఆర్చరీలో ఆడనున్నారు. 2018లో అర్చరీలో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన చికీత 2019లో గోవాలో నిర్వహించిన పోటీలో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్(Gold medals)ను సాధించింది. రిపబ్లిక్ డే సందర్భంగా బెంగుళూరులో 2022లో నిర్వహించిన పోటీల్లో సైతం నేషనల్ లెవల్లో గోల్డ్ మెడల్ సాధించి తనసత్తాను నిరూపించుకుంది.
నేషనల్ ఆర్చరీ అసోసియేషన్ ఇండియా(ఎన్ ఏఏఐ) జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపిన 32మంది క్రీడాకారులను ఎంపిక చేయగా అందులో తెలంగాణ నుంచి చికీత ఎంపికైంది. తెలుగు రాష్ట్రాల్లోనే కంపౌండ్ లెవల్ పోటీల్లో మొదటిసారిగా మెడల్ సాధించింది. నేషనల్ ర్యాంకింగ్ అర్చరీ టోర్నమెంట్స్(ఎన్‌ఆర్‌ఏటీ) సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ స్థాయిలో 8మందిని ఎంపిక చేయగా అందులో చోటు దక్కించుకుంది. 2022 ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ నుంచి అర్చరీలో ఎంపికైన ఏకైక క్రీడాకారిణిగా చికీత ఎంపికైంది.
తెలంగాణ రాష్ట్రం నుంచి ఫస్ట్ ఓపెన్ ట్రయల్స్ ఏషియన్ గేమ్స్, వరల్డ్ గేమ్స్, వరల్డ్ కప్ గేమ్స్‌కు తెలంగాణ నుంచి ఎంపికైంది. ప్రస్తుతం ఏషియన్ గేమ్స్‌కు నిర్వహిస్తున్న ట్రయల్స్‌లో పొల్గొని తన సత్తా చాటింది. చికీత ఏషియన్ గేమ్స్‌కు ఎంపికావడంపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి కొమురోజు శ్రీనివాస్, కోచ్ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు.