మన్సురాబాద్, జూన్ 26: యాదవులను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నదని అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీంద్రనాథ్ విమర్శిం చారు. యాదవ భవనం కోసం గత ప్రభుత్వం కోకాపేటలో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి రూ.5 కోట్ల నిధులను మంజూరు చేసిందని గుర్తుచేశారు. ఆ భవన నిర్మాణం పూర్తయ్యిందని, కాబట్టి ప్రభుత్వం తక్షణమే తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాగోల్‌లోని శుభం కన్వెన్షన్ హాల్లో గురువారం నిర్వహించిన అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశానికి రవీంద్రనాథ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
‘యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కట్టబెట్టాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవులకు అన్ని పార్టీలు ఎక్కువ సీట్లు కేటాయించాలి. ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్ల వల్ల యాదవులకు సరైన న్యాయం జరుగడం లేదు. జనగణనలో కులగణన చేపట్టాలి. ఆధార్‌కార్డులో కులాన్ని చేర్చితే బీసీల సంఖ్య సరిగ్గా తేలుతుంది’ అని రవీంద్రనాథ్ పేర్కొన్నారు. అఖిల భారత యాదవ మహాసభ ఉపాధ్యక్షుడు మేకల రాజేందర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్ లక్ష్మణ్ యాదవ్, ఎడ్ల హరిబాబు యాదవ్, ఉపాధ్యక్షుడు బాల మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.