సంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 6: ‘కూలిపోయిన ఇంట్లో ఉంటున్నాం. వర్షమొస్తే పెంకులు ఊడి మీద పడుతున్నాయి. పాములు, తేళ్లు వస్తున్నాయి. ఎప్పుడు కూలుతుందోనని భయంతో బతుకుతున్నాం. మాకు దిక్కెవరూలేరు. ఎక్కడికి పోవాలి. బుక్కెడన్నం కష్టంగా మారింది. అమ్మానాయినలతోపాటు మేం చనిపోయినా బాగుండు’.. 14, 10 ఏండ్ల వయస్సులోనే చిన్నారుల అంతులేని ఆవేదన ఇది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంం కొత్తగూడెంకు చెందిన గుర్రం సువర్ణ, శ్రీనివాసులు దంపతులు కూలి పనులుచేస్తూ బతికేవారు. వీరి కూతురు సోని (14), కుమారుడు వినయ్ (10) నారాయణపురంలోని మోడల్ స్కూల్లో 9వ తరగతి, 5వ తరగతి చదువుతున్నారు. ఏడాది క్రితం సువర్ణ అనారోగ్యంతో మృతిచెందింది. భార్య మృతిని తట్టుకోలేక శ్రీనివాసులు కూడా ఎనిమిది నెలల క్రితం అనారోగ్యంతో కన్నుమూశాడు. చిన్నారులకు వృద్ధాప్యంలో ఉన్న నాయినమ్మే దిక్కయ్యింది. ఆమెకు వచ్చే వితంతు పింఛన్, రేషన్బియ్యంతో అర్ధాకలి మాత్రమే తీర్చగలుగుతున్నది. ‘రోజూ పిల్లలు అమ్మనాయిన కావాలని ఏడుస్తున్నారు. నా ఆరోగ్యం బాగా లేదు. పింఛన్ పైసలతోనే కాలం వెల్లదీస్తున్న. పిల్లలకు రెండు పూటల అన్నం పెట్టడం కూడా కష్టమైతున్నది. నేను చచ్చిపోతే పిల్లలు ఆగమైపోతారు. ఇల్లు ఎప్పుడు కూలుతుందోనని భయంగా ఉన్నది. ఎవరైనా సాయం చేయండి సారు నాలుగు రేకులు వేసుకుంటాం’అని గుర్రం పార్వతమ్మ చేతులెత్తి మొక్కుతున్నది. సహాయం చేయాలనుకోనే దాతలు ఈ ఫోన్ నంబర్ 9553449699లో సంప్రదించవచ్చు.
పార్వతమ్మ గుర్రం
బ్యాంకు ఖాతా నంబర్: 105011676-2
ఐఎఫ్ఎస్సీ కోడ్:
ఏపీజీవీ0006213లో
నగదు జమచేయవచ్చు