హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ప్రజా సేవకులుగా నియమితులైన అధికారులు ఆశయ సిద్ధి, చిత్తశుద్ధితో పని చేస్తే అద్భుతాలు సృష్టించొచ్చని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్నారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో అఖిల భారత సర్వీసులు, కేంద్ర ప్రజా సర్వీసుల అధికారుల కోసం నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న ఆలోచనలతోనే పెద్ద మార్పునకు నాంది పలుకొచ్చని తెలిపారు. విధుల్లో ఆదర్శప్రాయంగా, నైతిక నిబద్ధత కలిగి ఉండాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర పథకాలు దేశవ్యాప్తంగా శిక్షణ తీసుకొంటున్న అధికారులకు గొప్ప ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. గడిచిన ఏడేండ్లలో తెలంగాణ ప్రభుత్వం 250 కోట్ల మొక్కలు నాటి 7 శాతం పచ్చదనాన్ని పెంచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంసీఆర్హెచ్ఆర్డీ డీజీ మహేశ్ దత్ ఎక్కా, ఐఎఫ్ఎస్ అధికారి తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.