హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్)లో జరిగిన అగ్నిప్రమాదంపై రోజురోజుకూ అనుమానాలు పెరుగుతున్నాయి. ఆ అగ్నిప్రమాదం ఓ కుట్రలో భాగంగానే జరిగిందని, ఆధారాలు చెరిపివేసేందుకే ఇంతటి ఘాతుకానికి తెగబడ్డారని ప్రతిపక్షం ఆరోపిస్తున్నా.. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల నుంచి ఇప్పటికీ సరైన సమాధానం రావడంలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్నిప్రమాదంపై అడిగిన ప్రశ్నలకు సమాధానం దాటవేశారు. ‘ఎన్నికల గురించి మాట్లాడండి.. ప్రజలకు మంచిచేసే వాటి గురించి మాట్లాడుదాం?’ అంటూ గుస్స అయ్యి.. వెంటనే సమావేశం ముగించారు. దీంతో మీడియా మిత్రులు సైతం పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి, ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల మౌనం వెనుక ప్రజల్లో అనేక సందేహాలు పుట్టుకొస్తున్నాయి. ఈ కుట్ర కోణం సంగతి ఎలా ఉన్నా.. దేశంలోనే ప్రతిష్టాత్మకమైనదిగా హైదరాబాద్ ఎఫ్ఎస్ఎల్ నిలిచింది. ఒక్క తెలంగాణకే కాకుండా.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా ఇక్కడికి ఎనాలసిస్ కేసులు వస్తుంటాయి. శాస్త్రీయమైన విశ్లేషణ, నిక్కచ్చిగా ఫలితాలు రావాల్సిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం, ఆయా రాష్ర్టాల హైకోర్టులు కూడా హైదరాబాద్ ఎఫ్ఎస్ఎల్కు కేసులను రిఫర్ చేస్తుంటాయి. నిరుడు 28 సంక్లిష్ట కేసులను సుప్రీంకోర్టు, ఆయా రాష్ర్టాల హైకోర్టులు మన ఎఫ్ఎస్ఎల్కు పంపాయి. ఈ అగ్నిప్రమాదం ఎఫెక్ట్ ఇక నుంచి వచ్చే కేసులపై తప్పకుండా ఉంటుందని, ఇప్పటివరకూ ఉన్న మంచిపేరు పోతుందని సిబ్బంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
నిరుడు 1,415 పోక్సో కేసులు..
తెలంగాణలో ముక్కుపచ్చలారని చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పడానికి ఎఫ్ఎస్ఎల్కు వచ్చిన కేసులే సాక్ష్యాలు. గతేడాది కేవలం 11 నెలల్లో 1,425 పోక్సో కేసుల్లో పరీక్షలు నిర్వహించి.. నిందితులను గుర్తించారు. బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు, నేరస్తులకు త్వరగా శిక్షలు పడేందుకు కేవలం 30 రోజుల్లోపే విజయవంతంగా నివేదికలు కోర్టుకు సమర్పించారు. సంగారెడ్డి జిల్లాలోని సిగాచి పరిశ్రమలో జరిగిన భారీ పేలుడులో మృతదేహాలను గుర్తించడంలో ఎఫ్ఎస్ఎల్ కీలకంగా పనిచేసింది. కేవలం 14 గంటల్లోనే 26 మంది మృతులను గుర్తించింది. ఈ ఘటనలో జాతీయస్థాయిలో ఒక బెంచ్‌మార్క్‌ను క్రియేట్ చేసింది.
పెరిగిన నేరాలు..వేధిస్తున్న నిపుణుల కొరత
సమయానుకూల ఫోరెన్సిక్ రిపోర్టింగ్, కచ్చితమైన శాస్త్రీయ విశ్లేషణ, కోర్టుల్లో నేర నిరూపణకు ప్రత్యక్షంగా దోహదపడే నివేదికలు ఇస్తారనే పేరున్న ఎఫ్‌ఎస్‌ఎల్‌ను నిపుణుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ఒకవైపు రాష్ట్రంలో పెరిగిన నేరాలకు తగ్గట్టుగా.. వాటిని విశ్లేషించే నిపుణులు అందుబాటులో లేరు. ఉన్నవారికి పనిభారమవుతుండగా రెండేండ్ల నుంచి రిక్రూట్మెంట్ లేకపోవడంతో అక్కడ పనిచేసే ఉన్నతాధికారులు ప్రభుత్వానికి మొరపెట్టగా.. 60 పోస్టులు మంజూరు చేశారు. అవి ప్రస్తుతం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ దశలోనే ఉన్నాయి. కాగా, గవర్నమెంట్ ఎగ్జామినర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ (జీఈఈ)గా ఎఫ్ఎస్ఎల్కు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మంత్రిత్వశాఖ నుంచి గుర్తింపు ఉంది. దీని ద్వారా భారతదేశం అంతటా నమోదైన కేసులకు సంబంధించి ఎలక్ట్రానిక్ సాక్ష్యాధారాలను అధికారికంగా పరిశీలించడానికి, దర్యాప్తు చేయడానికి, ధ్రువీకరించడానికి మన ఎఫ్ఎస్ఎల్కు అధికారం ఇచ్చారు. ఇంతటి కీర్తి ప్రతిష్టలున్న ఎఫ్ఎస్ఎల్లో రెండేండ్లుగా పోస్టుల భర్తీ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో ఫోరెన్సిక్ సామర్థ్యం, శక్తిని పెంపొందించడం కోసం ‘మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ సైంటిఫిక్ కిట్’లపై 51 మంది సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు.