తూప్రాన్, ఆగస్టు 26: గజ్వేల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ.. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిన తమ ముఖ్యమంత్రి కేసీఆర్.. కామారెడ్డి నుంచి కాకుండా గజ్వేల్ నుంచే పోటీ చేయాలని మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పాలకవర్గం కోరింది. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్‌గౌడ్‌తో పాటు పాలకవర్గ సభ్యులు కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేశారు. శనివారం తూప్రాన్ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ.. గజ్వేల్ గడ్డ కేసీఆర్ అడ్డా అని పేర్కొన్నారు. గజ్వేల్ కేం ద్రంగా తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్‌ను గజ్వేల్‌లో ఈ సారి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పారు. మంత్రి హరీశ్‌రావుపై మైనంపల్లి హనుమంతరావు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయన బేషరతుగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, మంత్రి హరీశ్‌రావుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.