మనది న్యాయపథం.. మనది ధర్మపథం.. సకలజనుల సంక్షేమమే మనకు సమ్మతం సర్వతోముఖాభివృద్ధే మన అభిమతం. మన నిబద్ధత, నిజాయితీ జనావళికి అభయం ముమ్మాటికీ మనలనే వరిస్తుంది విజయం.. ఇది సత్యం, ఇది నిత్యం, ఇది తథ్యం..స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలను నిజంచేద్దాం జాతి నిర్మాణంలో తెలంగాణను అనునిత్యం అగ్రభాగంలో నిలుపుదాం
– సీఎం కేసీఆర్
CM KCR | హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): సకల జనుల సంక్షేమం, సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ పురోగమిస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ఏకకాలంలో విజయవంతంగా సాధిస్తున్నామని చెప్పారు. శుక్రవారం హైరాబాద్లోని హెచ్ఐసీసీలో భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ చూపిన అహింసా మార్గంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించామని, ఆయన ప్రవచించిన గ్రామ స్వరాజ్యం, మతసామరస్యం పునాదులపైనే రాష్ర్టాన్ని అభివృద్ధివైపు పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు. సంక్షేమానికి అగ్ర తాంబూలమివ్వడంలోనూ, రైతు కేంద్రంగా ప్రణాళికలు రచించటంలోనూ, గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంలోనూ మహాత్మాగాంధీ ప్రభావమే ఉన్నదని చెప్పారు. ‘భారతదేశ ఆత్మ గ్రామాల్లోనే ఉన్నదని గాంధీ పదేపదే చెప్పారు. ఆ మాటల ప్రేరణతోనే గ్రామీణ జీవన ప్రమాణాలను అభివృద్ధి చేసుకొంటున్నాం. గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలదాకా, వ్యవసాయం మొదలుకొని, పరిశ్రమలు, ఐటీ రంగాల అభివృద్ధిదాకా, గిరిజనులు, దళితులు, మైనారిటీలు మొదలుకొని, అగ్రవర్ణ పేదలదాకా అన్నింటికీ, అందరికీ సమ ప్రాధాన్యం ఇస్తున్నాం. మాది సమీకృత, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధి నమూనా. అందుకే ఈరోజు తెలంగాణ మాడల్ దేశానికి దిక్సూచిగా నిలిచింది’ అని వెల్లడించారు.
వ్యవసాయంతోనే గ్రామస్వరాజ్యం..
తెలంగాణ ఉద్యమం ఆదర్శవంతంగా నిలిచినట్టే, తెలంగాణలో పరిపాలన కూడా దేశ స్వాతంత్య్ర పోరాట ఆశయాలకు అద్దంపడుతున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. స్వతంత్ర భారతంలో గతంలో ఎవరికీ సాధ్యంకాని విధంగా వ్యవసాయ సంక్షోభాన్ని పరిషరించామని చెప్పారు. ‘రైతుబంధుద్వారా రైతన్నల కండ్లల్లో వెలుగులు చూస్తున్నాం. గ్రామ స్వరాజ్యం, గ్రామ స్వయంపోషకత్వం దిశగా మనం ఎంతో దూరం ప్రయాణించాం. గ్రామీణ వృత్తులకు ప్రోత్సాహమిచ్చాం. వెరసి గ్రామాలు సుసంపన్నంగా మారాయి. ప్రజలందరికీ సురక్షిత తాగునీరు కూడా ఇంతకాలం ఏ ప్రభుత్వాలు ఇవ్వలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఈ విషయంలో దేశానికి ఆదర్శంగా నిలిచింది’ అని తెలిపారు.
అహింస మార్గంలోనే ప్రాణాన్ని పణంగా పెట్టి..
గాంధీ మార్గంలో, రాజ్యాంగ పరిధిలో ఉద్యమించడం వల్లనే తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైందని సీఎం కేసీఆర్ అన్నా రు. ‘ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం అంటే హింసాత్మక ఆందోళన అనే అభిప్రాయం ఉండేది. టీఆర్ఎస్ను స్థాపించినపుడు అహింసాయుత ఉద్యమం ద్వారా, రాజ్యాంగ పరిధిలోనే ఉద్యమించి విజయం సాధిస్తామని నేను స్పష్టంగా ప్రకటించాను. మొదట కొందరు నాతో ఏకీభవించలేదు. కానీ రానురాను అందరూ నేను ఎంచుకున్న మార్గమే సరైనదని అంగీకరించి వెంట నడిచారు. ప్రాణాన్ని పణంగా పెట్టయినా సరే లక్ష్యాన్ని సాధించాలి తప్ప, అహింసామార్గాన్ని వీడకూడదని నేను నిర్ణయించుకున్నాను. ఆ నేపథ్యంలో వచ్చిందే ఆమరణ నిరాహార దీక్ష ఆలోచన. స్వాతంత్య్ర పోరాటకాలంలో బ్రిటిష్ పాలనే బాగుందన్న ప్రబుద్ధులూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమకాలంలోనూ అలాంటివారు ఉన్నారు. చాలామంది ‘తెలంగాణ వద్దు.. సమైక్య పాలనే ముద్దు’ అని చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. మన చిత్తశుద్ధి ముందు వాళ్ల ప్రయత్నాలన్నీ విఫలం కాక తప్పలేదు. విచిత్రం ఏమిటంటే..వాళ్లే ఇవాళ మనకు తెలంగాణ ఉద్యమం గురించి పాఠాలు చెప్పడానికి సిద్ధపడుతున్నారు’ అని సీఎం పేర్కొన్నారు.
త్యాగాలను స్మరించుకోవడం మన బాధ్యత
స్వాతంత్య్ర పోరాట చరిత్రనీ, స్వాతంత్య్రం కోసం ప్రాణాలను ధారపోసిన మహనీయులను స్మరించుకోవటం ప్రతి భారతీయుడి బాధ్యత అని సీఎం కేసీఆర్ అన్నారు. భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రనూ ఆదర్శాలనూ, నేటి తరానికి తెలియజేయాలనే సత్సంకల్పంతో గత ఏడాది వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలను 15 రోజులపాటు ఘనంగా నిర్వహించుకొన్నామని తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పారు. 30 లక్షల మంది విద్యార్థులకు గాంధీ చలనచిత్రాన్ని చూపించటం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్‌కుమార్, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, ఇతర ప్రజానిధులు పాల్గొన్నారు.
మహాత్ముడి మృతి చారిత్రక విషాదం
జీవితాంతం మతసామరస్యం కోసం కృషిచేసిన మహాత్ముడు మతోన్మాదుల చేతిలోనే చనిపోవటం చారిత్రక విషాదమని సీఎం కేసీఆర్ అన్నారు. ‘మహాత్మాగాంధీ చరఖా చేతబట్టి నూలు వడికినా, చీపురు పట్టుకొని మురికి వాడలు శుభ్రం చేసినా, ఉప్పు తయారుచేసినా, ఉపవాస దీక్ష చేసినా బ్రిటిష్ ప్రభుత్వం వణికిపోయింది. ఈశ్వర్ అల్లా తేరే నామ్ సబ్ కో సన్మతి దే భగవాన్ అంటూ మత సామరస్యం కోసం పోరాడిన గాంధీజీ, చివరికి మతోన్మాద శక్తుల చేతుల్లోనే హత్యకు గురికావడం చారిత్రక విషాదం. గాంధీజీ ఒక భారతదేశం మీదనే కాదు, యావత్ ప్రపంచం మీద చెరగని ముద్ర వేశారు. మార్టిన్ లూథర్‌కింగ్ నుంచి, నెల్సన్ మండేలావరకు నల్లజాతి ప్రజల పోరాటాలకు గాంధేయవాదమే ఆదర్శంగా నిలిచింది. నైతికత, నిరాడంబరత, పేదల పట్ల ప్రేమలో మహత్మాగాంధీ స్థాయిని నేనెన్నటికీ అందుకోలేకపోయాను. గాంధీ ఏ బలహీనతలు లేని మనిషి. నేను అనేక బలహీనతలున్నవాడిని అని నెల్సన్ మండేలా స్వయంగా చెప్పారు’ అని కేసీఆర్ పేర్కొన్నారు. భారతదేశం మానవజాతి ఆవిర్భావ వికాసాలకు, ఉతృష్టమైన ఆధ్యాత్మిక తాత్విక చింతనకు, ఉన్నతమైన నాగరికతకు, సంప్రదాయాలకు పుట్టినిల్లని అన్నారు. ‘బ్రిటిష్ పాలన మన దేశానికి లాభదాయకమని, బ్రిటిషర్లు మనదేశాన్ని ఉద్ధరిస్తున్నారని నమ్మే దురాలోచనాపరులు ఆనాడు కూడా ఉండేవారు’ అని తెలిపారు.
జాతి నిర్మాతలకు వజ్రోత్సవ నివాళి
శుక్రవారం హెచ్ఐసీసీలో జరిగిన భారత వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మహాత్ముడి విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న సీఎం కేసీఆర్