ములుగు : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంరక్షణ చర్యలతో రాష్ట్రంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డోబ్రియల్ (Chief Forest Officer Dobrial) అన్నారు. మండల కేంద్రం ములుగులోని అటవీ కళాశాలలో శనివారం ప్రపంచ పులుల దినోత్సవాన్ని (Tigers Day) నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR ) నేతృత్వంలో అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంరక్షణ చర్యలతో తెలంగాణలో పులుల సంఖ్య పెరిగిందన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా మారిన వాతావరణ పరిస్థితులు పర్యావరణ పరిరక్షణకు ముప్పుగా మారాయని వెల్లడించారు. ఉన్న అడవుల సంరక్షణ దీనికి పరిష్కార మార్గమని పేర్కొన్నారు. . పులులను మనం కాపాడితే అవి అడవిని, తద్వారా మనుషులను కాపాడుతాయన్నారు. దేశవ్యాప్తంగా చేపడుతున్న ప్రాజెక్టు టైగర్ కార్య్రమం సత్పలితాన్నిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో 3167 పులులు ఉన్నాయని తెలిపారు. రానున్న రోజుల్ల తెలంగాణలో పులుల ఆవాసాలను మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. అటవీ ప్రభావిత గ్రామాల పరిసరాల్లో జంతువుల, మనుషుల మధ్య జరిగే సంఘర్షణను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అటవీ కళాశాల డీన్ ప్రియాంక్ వర్గీస్ మాట్లాడుతూ భవిష్యత్తులో పర్యావరణవేత్తలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అటవీ కళాశాలను ఏర్పాటు చేశారని అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరుకు ‘గ్లోబల్ టైగర్డే’ వేడుకలను అటవీ కళాశాలలో నిర్వహించామని ఇది అటవీ సిబ్బందికి, అటవీ విద్యనభ్యసిస్తున్న విద్యార్ధులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో విజిలెన్స్ పీసీసీఎఫ్ ఏలూసింగ్మేరు, అడిషనల్ పీసీసీఎఫ్ వినయ్‌కుమార్, సీపీఎఫ్ సైదులు, ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ ఆశ, అటవీ కళాశాల అధికారులు విద్యార్ధులు పాల్గొన్నారు. టైగర్ థీమ్ పేరిట పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.