పెద్దపల్లి, జూన్ 3(నమస్తే తెలంగాణ) : ఎల్లంపల్లి ప్రాజెక్టులోని అక్రమ చెరువుల్లోని చేపలకు కోళ్ల వ్యర్థాలే మేతగా వేస్తున్నారు. నిత్యం టన్నులకొద్దీ కుళ్లిన చికెన్, మటన్ పదార్థాలను రాత్రివేళల్లో తరలిస్తున్నారు. సమీపంలోని కరీంనగర్, రామగుండం నగరాల నుంచి వాటిని గుట్టుచప్పుడు కాకుండా చేరవేస్తున్నారు. అధికార పార్టీ నేతలు, జిల్లా ఉన్నతాధికారుల అండదండలతో చెరువులను నిర్వహిస్తున్న ముఠా అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులో 150 ఎకరాల విస్తీర్ణంలోని ఇరిగేషన్ భూములను కబ్జా చేసిన అక్రమార్కులు 36 చెరువులను తవ్వారు. సమీప గ్రామాలకు చెందిన నలుగురితోపాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన మరో ఏడుగురు కలిసి ఒక ముఠాగా ఏర్పడి చెరువులను నిర్వహిస్తున్నారు. ఈ విషయాలను ‘నమస్తే తెలంగాణ’ రెండు రోజులుగా వరుస కథనాలు ప్రచురిస్తున్నా, అధికార పార్టీ నాయకులు, జిల్లా ఉన్నతాధికారుల అండదండలతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఎల్లంపల్లి ఎగువున చేపల చెరువులను నిర్వహిస్తున్న అక్రమార్కులు, ఏకంగా ఎల్లంపల్లి రిజర్వాయర్ నీటిని కలుషితం చేస్తున్నారు.
చెరువుల్లో చేపలకు మేతగా కోళ్ల కాళ్లు, పేగులు, తోళ్లు, ఈకలు, మేక మాంసానికి చెందిన బక్కీ తదితర వ్యర్థాలను పడేస్తున్నారు. నిత్యం కరీంనగర్, రామగుండం నగరాల్లో చికెన్, మటన్ సెంటర్ల నుంచి ఆ వ్యర్థాలను సేకరించి రాత్రివేళ 9 నుంచి 11 గంటల సమయాల్లో ప్రత్యేక వాహనాల్లో చేపల చెరువుల వద్దకు చేరవేస్తుననారు. అక్కడే ఆ వ్యర్థాలను ఉడికించి చేపలకు మేతగా వేస్తున్నారు. ఉడికించేందుకు చెరువుల వద్ద ప్రత్యేక పాత్రలను ఏర్పాటుచేశారు. చేపల మేతకు అవసరమైన ముడి పదార్థాల ధరలు పెరగడంతోనే వ్యర్థాలను ఆహారంగా అందిస్తున్నట్టు తెలుస్తున్నది. దీంతో ఆరు నెలల్లో కిలో సైజు వరకు పెరగాల్సిన చేపలు కేవలం మూడు నెలల్లోనే అనుకున్న సైజు పెరిగేలా చేస్తున్నారు. వాటిని హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దిగువన ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వదులుతూ, జలాశయాన్నీ కలుషితం చేస్తున్నారు.
చికెన్, మటన్ వ్యర్థాలతో చేపలను పెంచుతున్న అక్రమార్కులు, చెరువుల్లో విషతుల్యమైన జలాలను 15-20 రోజులకు ఒకసారి మార్చుతున్నారు. ఎల్లంపల్లి జలాశయం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మోటర్ల ద్వారా చెరువుల్లోకి నీటిని నింపుకుంటూ, అప్పటికే చెరువుల్లోని కలుషిత జలాలను మరోమార్గం ద్వారా ఎల్లంపల్లిలోకి వదులుతూ జలాశయ నీటిని విషతుల్యం చేస్తున్నారు. ఈ చెరువుల దిగువనే హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సైప్లె, సీవరేజ్ బోర్డ్ స్కీం ద్వారా ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి రోజూ 177.88 ఎంజీడీల రా వాటర్‌ను హైదరాబాద్ నగరానికి సరఫరా చేస్తున్నారు. అంతర్గాం మండలం ముర్మూర్‌లో 160 ఎంఎల్డీ సామర్థ్యం గల మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్‌కు సైతం ఈ చెరువుల నుంచి వచ్చే కలుషితమైన నీరే సరఫరా అవుతున్నది.
ఎల్లంపల్లి భూములను కబ్జాచేసి ఏర్పాటుచేసిన చెరువుల్లో మాంసం వ్యర్థాలతో చేపలను పెంచుతున్నారని పలువురు స్థానికులు పెద్దపల్లి జిల్లా మత్స్య శాఖ అధికారి నరేష్కుమార్ నాయుడుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆ అధికారి అంతర్గాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వెంటనే చెరువుల నిర్వాహకులను తీసుకొచ్చి బైండోవర్ చేస్తామని, ఆ సమాచారం మత్స్యశాఖ అధికారులకు ఇస్తామని తొలుత పోలీసులు పేర్కొన్నారు.