హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ జలాలను 66:34 నిష్పత్తిలో వినియోగించుకునేందుకు ఒప్పుకోలేదని కేఆర్ఎంబీ 16వ బోర్డు సమావేశంలోనే తెలంగాణ స్పష్టం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫు సాక్షి చేతన్ పండిట్ మరోసారి కృష్ణా ట్రిబ్యునల్-2కు తెలిపారు. తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్-2 చేపట్టిన విచారణ బుధవారం ఢిల్లీలో పునఃప్రారంభమైంది.
ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ విశ్రాంత సీఈ, తెలంగాణ తరపు సాక్షి చేతన్ పండిట్‌ను పలు అంశాలపై ఏపీ సీనియర్ న్యాయవాది ఉమాపతి క్రాస్ ఎగ్జామిన్ చేశారు. కేఆర్ఎంబీ 16వ సమావేశంలో తెలంగాణ తన వాదనను బలంగా వినిపించిందని, 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాలను వినియోగించుకోవాలన్న ప్రతిపాదనను తెలంగాణ సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యతిరేకించారని చేతన్ వెల్లడించారు. ఇదే విషయమై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిందని గుర్తుచేశారు.
కృష్ణా బేసిన్లో ప్రస్తుత ఏపీ అత్యల్ప నదీతీర రాష్ట్రమని, ఈ నేపథ్యంలో బేసిన్‌లోని మిగులు జలాలను పూర్తిగా తామే వినియోగించుకొంటామని ఏపీ చేసిన వాదనను చేతన్ వ్యతిరేకించారు. ఏపీతో పోలిస్తే నీటి కొరత తీవ్రంగా ఉన్న తెలంగాణకే మిగులు జలాలను ఉపయోగించుకునే హకు ఉన్నదని ఆయన స్పష్టం చేశారు.