హైదరాబాద్, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ): వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదం కేసును భౌతికంగా విచారించాలని హైకోర్టు నిర్ణయించింది. ఈ కేసులో పలుతీర్పులకు సంబంధించిన చట్టాలను, పత్రాలను పరిశీలించాల్సి ఉన్నదని, భౌతికంగా విచారణ చేపడితేనే అవన్నీ సులభమవుతాయని స్పష్టంచేసింది. భౌతిక విచారణ చేపట్టాలని ముందుగా చెన్నమనేని తరఫు న్యాయవాది వై రామారావు కోరారు. ఈ ప్రతిపాదనను కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్ రాజేశ్వర్‌రావు, రాష్ట్రం తరఫున అదనపు అడ్వొకే ట్ జనరల్ జే రామచందర్ రావు సమర్థించారు. దీంతో భౌతిక విచారణ చేపడతామని న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. చెన్నమనేనికి జర్మనీ పౌరసత్వం ఉండగానే భారతదేశ పౌరసత్వాన్ని పొంది, చట్టవిరుద్ధంగా శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారని ఆది శ్రీనివాస్ చేసిన ఫిర్యాదు ఆధారంగా కేంద్రం ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసింది. హైకోర్టు దానిని నిలిపివేసింది. ఈ నేపథ్యంలో గతంలోని వ్యాజ్యంపై విచారణ వచ్చేనెల 21కి వాయిదా పడింది.