హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): ప్రపంచ విప్లవకారులకు చేగువేరా మార్గదర్శకం, స్ఫూర్తిదాయకమని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. చేగువేరా 87వ జయంతి సందర్భంగా శనివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దుంభవన్లో చేగువేరా చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జీవితాంతం పోరాటం చేసిన గొప్ప విప్లవకారుడు చేగువేరా అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అనేక దేశాల్లో ముఖ్యంగా అమెరికాలోని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా క్యూబా దేశంలో ఫెడరల్ క్యాస్ట్రో నాయకత్వంలో విప్లవం సాగించారని ఆయన గుర్తుచేశారు. లాటిన్ అమెరికా దేశాల్లో జరుగుతున్న సామ్రాజ్యవాదంపై పోరాటం నిర్వహించారని, ప్రపంచ విప్లవకారులు, కమ్యూనిస్టులు చేగువేరా పోరాటాన్ని మరువలేరని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యాలయ కార్యదర్శి ఏ గోవిందరావు, బిల్డింగ్ ఇన్చార్జి బోయ శ్రీరాములు, ఓయూ విద్యార్థి నాయకులు రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.